"బుల్లిపిట్ట" ఇకపై ఎలాంటి డ్రైవింగ్ టెస్ట్ లేకుండానే డ్రైవింగ్ లైసెన్స్ మీ సొంతం...
సాధారణంగా 18 సంవత్సరాలు నిండితే తప్పా,డ్రైవింగ్ లైసెన్స్ రావడం కష్టం. అసలు 18 సంవత్సరాలు నిండకుండానే డ్రైవింగ్ లైసెన్స్ ఏ ప్రభుత్వాలు ఇవ్వవు. డ్రైవింగ్ లైసెన్స్ కావాలి? అంటే మాత్రం తప్పకుండా వారికి ముందే డ్రైవింగ్ తెలిసి ఉండాలి. డ్రైవింగ్ టెస్ట్ చేసిన తర్వాతనే,డ్రైవింగ్ లైసెన్స్ మంజూరు చేస్తారు అందుకు సంబంధించిన అధికారులు. ఇప్పుడు కేంద్రం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఎలాంటి డ్రైవింగ్ టెస్ట్ లేకుండానే, డ్రైవింగ్ లైసెన్స్ లను ఇచ్చేందుకు కేంద్రం సిద్ధమవుతోంది. అయితే కేంద్రం ఎందుకు ఈ నిర్ణయం తీసుకుందో? ఇప్పుడు తెలుసుకుందాం..
ఇక పై డ్రైవింగ్ టెస్ట్ లేకుండానే,డ్రైవింగ్ లైసెన్స్ లను జారీ చేయాలని కేంద్ర రోడ్డు రవాణా మంత్రిత్వ శాఖ నిర్ణయించింది. దీనికి సంబంధించిన నోటిఫికేషన్ ను శుక్రవారం (2021 ఫిబ్రవరి 5) విడుదల చేసింది. పౌరులకు డ్రైవింగ్ శిక్షణ అందించేందుకు, శిక్షణా కేంద్రాల, నిర్దిష్టమైన అర్హతలతో కూడిన ముసాయిదాను రూపొందించింది. ఇక ఈనేపథ్యంలో పౌరులకు డ్రైవింగ్ నేర్పించడానికి రంగం సిద్ధం చేస్తోంది. ఇక ఈ కేంద్రాలలో డ్రైవింగ్ శిక్షణ ను విజయవంతంగా పూర్తిచేసిన వారికి, ఎలాంటి డ్రైవింగ్ టెస్ట్ లేకుండానే డ్రైవింగ్ లైసెన్స్ లను జారీ చేయాలని నోటిఫికేషన్ లో పేర్కొనడం జరిగింది.
ఈ డ్రైవింగ్ శిక్షణ రవాణా పరిశ్రమకు సుశిక్షితులైన డ్రైవర్లను అందించేందుకు తోడ్పడనుంది. ఇక రోడ్డు ప్రమాదాలను గణనీయంగా తగ్గించడానికి, రవాణా మంత్రిత్వ శాఖ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. 2025 సంవత్సరం నాటికి రోడ్డు ప్రమాదాలను సగానికిపైగా తగ్గించాలన్న నేపథ్యంలో కేంద్రం ఈ నిర్ణయం తీసుకొని, ముసాయిదాను రూపొందించినట్లు తెలుస్తోంది. ఇకపై రోడ్డు ప్రమాదాలను గణనీయంగా తగ్గించేందుకు, కేంద్ర ప్రభుత్వం సరికొత్త ముసాయిదాను రూపొందించినట్టు గా కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ తెలిపారు.
రవాణా వ్యవస్థలో ఇకపై ఎటువంటి ప్రమాదాలు జరగకుండా, ఎంతో నైపుణ్యం కలిగిన సుశిక్షితులైన డ్రైవర్లను అందించేందుకు కేంద్రం సిద్ధమవుతోంది. అయితే త్వరలోనే ఎవరైతే డ్రైవింగ్ నేర్చుకోవాలి అన్న ఆసక్తితో ఉన్నారో, వారికి కూడా పూర్తిగా డ్రైవింగ్ విద్యను అభ్యసించేందుకు కేంద్రం తగినన్ని ఏర్పాట్లు చేస్తోందని సమాచారం.