టెక్నాల‌జీ: కరోనా విజృంభిస్తున్న వేళ‌ ప్రతీ ఇంట్లో ఉండాల్సిన ప‌రిక‌రం ఇదే!!

Kavya Nekkanti

ప్ర‌పంచ‌దేశాల్లోనూ అతిసూక్ష్మ‌జీవి క‌రోనా వైర‌స్ విల‌య‌తాండ‌వం సృష్టిస్తున్న సంగ‌తి తెలిసిందే. చిన్నా.. పెద్ద అని తేడా లేకుండా అంద‌రిపై క‌రోనా దాడి చేస్తోంది. ఈ క్ర‌మంలోనే ల‌క్ష‌ల మంది ప్రాణాలు కోల్పోతున్నారు. మ‌రోవైపు క‌రోనా పాజిటివ్ కేసులు సంఖ్య అంత‌కంత‌కూ పెరిగిపోతోంది. ఈ మ‌హ‌మ్మారిని అడ్డుకునే వ్యాక్సిన్ కూడా లేక‌పోవ‌డంతో..  దీనిని క‌ట్ట‌డి చేయ‌డం పెద్ద స‌వాల్‌గా మారింది. ఇక ఈ క‌రోనా టైమ్‌లో మాస్కులు, శానిటైజర్లకు డిమాండ్‌ విపరీతంగా పెరిగింది. 

అలాగే డిజిటల్‌ థర్మామీటర్‌ను కూడా‌ ప్రస్తుతం అందరూ వాడుతున్నారు. దీని ద్వారా కేవలం జ్వరం ఉందా లేదా అనేది మాత్రమే తెలుస్తుంది. కానీ, కరోనా ఉందా లేదా అనేది తెలుసుకోవడం కుద‌ర‌దు. అయితే కరోనా సోకిన వ్యక్తిలో కనిపించే మరో ప్రధాన లక్షణం శరీరంలో ఆక్సీజన్ లభ్యత సరిగ్గా అందకపోవడం. దీన్ని కనుగొనేందుకు ప‌ల్స్ ఆక్సీమీటర్ చక్కగా ఉపయోగపడుతుంది. ఆక్సీమీటర్ ద్వారా గుండె కొట్టుకునే వేగంతో పాటు శరీరానికి సరైన మొత్తంలో ఆక్సిజన్‌ అందుతోందో కనుగొనవచ్చు.

త‌ద్వారా వైరస్‌ను అంచనా వేయొచ్చు. ఇది ఎలా ఉప‌యోగించాలంటే.. ప‌ల్స్ ఆక్సీమీటర్ లో మీ చూపుడు వేలు పెడితే.. మీ శరీరంలో ఆక్సిజన్ ఏ స్థాయిలో ఉందో తెలుస్తుంది. పల్స్ ఆక్సీమీటర్‌‌లో రీడింగ్ 95 నుంచి 100 మధ్యలో ఉంటే మీకు వైరస్ సమస్య లేనట్లు. రీడింగ్ 93 కంటే తక్కువ చూపిస్తే.. తప్పకుండా వైద్యులను సంప్రదించాలి. ఎందుకంటే.. పైన చెప్పిన‌ట్టు కరోనా సోకినవారిలో ఆక్సిజన్ సరఫరా రేటు బాగా తగ్గిపోతుంది. ఈ నేప‌థ్యంలోనే ప్రతి ఇంట్లో పల్స్‌ ఆక్సీమీటర్‌ తప్పకుండా ఉండాల‌ని నిపుణులు సూచిస్తున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: