కెప్టెన్ కాకపోయి ఉంటే.. రోహిత్ ను ఎప్పుడో పీకేసేవారు.. మాజీ షాకింగ్ కామెంట్స్?
ఈ క్రమంలోనే టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ అనేకమందినుండి విమర్శలు ఎదుర్కొంటున్నాడు. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో పేలవ ప్రదర్శన చేస్తున్న క్రమంలో ఈ అవమానాలు ఎదురవుతున్నాయని చెప్పుకోవచ్చు. ఇక ఈ సిరీస్‌లో తొలి టెస్టు ఆడని హిట్‌మ్యాన్ ఆ తర్వాత ఆడిన 3 టెస్టుల్లోనూ కలిపి 31 రన్స్ మాత్రమే స్కోరు చేయడం కాసింత విచారకరం. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో 3, 6, 10, 3, 9 స్కోర్లు నమోదు చేయడంతో సగటు 6.2గా నమోదైంది. జైశ్వాల్, నితీశ్ రెడ్డి లాంటి యువ ప్లేయర్లు రాణిస్తున్న ఇదే పిచ్‌లపై.. రోహిత్ మాత్రం పరుగులు చేసేందుకు మాత్రం తీవ్రంగా ఇబ్బంది పడుతున్నాడు. దీంతో అతడి ఆటతీరుపై విమర్శలు వస్తున్నాయి.
ఈ నేపథ్యంలో అతడిని జట్టు నుంచి తప్పించాలనే డిమాండ్‌లు కూడా బాగా వినిపిస్తున్నాయి. మరికొందరు రోహిత్ ఇక.. టెస్టు ఫార్మాట్‌కు గుడ్‌బై చెప్పాల్సిన సమయం దగ్గరైంది అని బాహాటంగానే కామెంట్స్ చేస్తున్న పరిస్థితి. ఈ నేపథ్యంలో టీమిండియా మాజీ క్రికెటర్ ఇర్ఫాన్ పఠాన్ కూడా రోహిత్ శర్మపై విమర్శలు గుప్పించడం కొసమెరుపు. భారత జట్టు కెప్టెన్ కాకపోయి ఉంటే.. రోహిత్ శర్మను కచ్చితంగా తుది జట్టులో నుంచి తప్పించేవారని తాజాగా కామెంట్స్ చేసాడు. అతడి వల్ల జట్టు కూర్పు దెబ్బతింటోందని కూడా వ్యాఖ్యానించాడు. కాగా బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో తొలి టెస్టుకు రోహిత్ శర్మ వ్యక్తిగత కారణాలతో దూరమయ్యాడు. జస్‌ప్రీత్ బుమ్రా సారథ్యంలో టీమిండియా ఆ మ్యాచ్‌లో చారిత్రాత్మక విజయాన్నందుకుంది. రెండో టెస్టు నుంచి రోహిత్ జట్టులోకి రాగా.. ఆడిన మూడు టెస్టుల్లో రెండిట్లో ఓడిపోయి.. ఒక దాన్ని డ్రా చేసుకుంది.