13 ఏళ్ల తర్వాత.. ఐపీఎల్ మెగా వేలంలోకి ఆ స్టార్ క్రికెటర్?
1,574 మంది ఆటగాళ్లతో కూడిన ఈ సుదీర్ఘ జాబితాలో రాజస్థాన్ రాయల్స్ మాజీ కెప్టెన్ బెన్ స్టోక్స్ తన పేరు నమోదు చేసుకోకపోవడం కొసమెరుపు. ఢిల్లీ క్యాపిటల్స్, లక్నో సూపర్ జెయింట్స్, కోల్కతా నైట్ రైడర్స్ కెప్టెన్లుగా విడుదలైన రిషబ్ పంత్, కేఎల్ రాహుల్, శ్రేయాస్ అయ్యర్ రూ. 2 కోట్ల కనీస ధరతో జాబితాలో ఉన్నట్లు ఈఎస్పీఎన్ క్రిక్ఇన్ఫో నివేదిక అర్పించింది. ఇక్కడ చెప్పుకోదగ్గ విషయం ఏమిటంటే, ఇంగ్లండ్ సీనియర్ పేసర్ జేమ్స్ అండర్సన్ అనూహ్యంగా మెగా వేలంలో తన పేరును నమోదు చేసుకోవడం.
అవును, ఇటీవలే అంతర్జాతీయ క్రికెట్కు రిటైర్మెంట్ ప్రకటించిన ఈ 42 ఏళ్ల క్రీడాకారుడు చివరిసారి 2011, 2012లో వేలంలో పాల్గొనగా ఎవరూ కొనుగోలు చేయలేదు. ఇప్పుడు 13 ఏళ్ల తర్వాత ఐపీఎల్లోకి అడుగుపెట్టడంతో సర్వత్రా ఆసక్తికరంగా మారింది. కాగా రూ. 2 కోట్ల కనీస ధర కలిగిన ఇతర భారత ఆటగాళ్ల విషయానికొస్తే... ఖలీల్ అహ్మద్, రవిచంద్రన్ అశ్విన్, యుజ్వేంద్ర చాహల్, అవేశ్ ఖాన్, దీపక్ చాహర్, వెంకటేశ్ అయ్యర్, భువనేశ్వర్ కుమార్, ఇషాన్ కిషన్, ముఖేష్ కుమార్, దేవదత్ పడిక్కల్, ప్రసిద్ధ్ కృష్ణ, టి నటరాజన్, హర్షల్ పటేల్, అర్ష్దీప్ సింగ్, కృనాల్ పాండ్యా, వాషింగ్టన్ సుందర్, మహమ్మద్ సిరాజ్, శార్దూల్ ఠాకూర్, ఉమేశ్ యాదవ్ ఉన్నారు. ఇక టీమిండియా యువ ఆటగాళ్లు అయినటువంటి పృథ్వీ షా, సర్ఫరాజ్ ఖాన్ కనీస ధర రూ.75 లక్షలుగా కేటాయించారు.