వావ్.. చెలరేగిన కింగ్ కోహ్లీ!

Purushottham Vinay
వావ్.. విరాట్‌ కోహ్లీ (82*; 53 బంతుల్లో 6x4, 4x6) 130 కోట్ల మందిని ఒక రేంజిలో మురిపించాడు. మెల్‌బోర్న్‌ మైదానాన్ని కోహ్లీ ఉర్రూతలూగించాడు. అఖండ భారతావనికి ఒక్కరోజు ముందుగానే ఆయన దీపావళి తీసుకొచ్చాడు. ఐసీసీ టీ20 ప్రపంచకప్‌ 2022 తొలి సూపర్‌ 12 మ్యాచులో టీమ్‌ఇండియాను ఒంటి చేత్తో గెలిపించాడు.విరాట్‌ కోహ్లీకి తోడుగా యంగ్ బ్యాట్స్ మెన్ హార్దిక్‌ పాండ్య (40; 37 బంతుల్లో 1x4, 2x6) చెలరేగిన వేళ టీమ్‌ఇండియా అద్భుతం చేసింది. యూఏఈలో టీ20 ప్రపంచకప్‌, ఆసియాకప్‌ ఓటములకు ఘనంగా తన ప్రతీకారం తీర్చుకుంది. దాయాది పాకిస్థాన్‌ నిర్దేశించిన 160 పరుగుల టార్గెట్‌ను సమయోచితంగా ఛేదించింది. ఒక రేంజిలో ఆడి 4 వికెట్ల తేడాతో ప్రత్యర్థిని చిత్తుచేసింది. అంతకు ముందు బాబర్‌ సేనలో ఇఫ్తికార్‌ అహ్మద్‌ (51; 34 బంతుల్లో 2x4, 4x6), షాన్‌ మసూద్‌ (52*; 42 బంతుల్లో 5x4, 0x6) హాఫ్ సెంచరీలు బాదేశారు. బౌలింగ్‌లో అర్షదీప్‌ సింగ్‌ (3/32), హార్దిక్‌ పాండ్య (3/30) రాణించారు.ఫస్ట్ ఓవర్లో ఓపెనర్లు షాహిన్‌షా అఫ్రిదిని ఆచితూచి ఆడారు. రెండో ఓవర్లో నసీమ్ షా వేసిన బంతిని ఎలా ఆడాలో నిర్ణయించుకోలేక కేఎల్‌ రాహుల్‌ (4) వికెట్ల మీదకు ఆడుకున్నాడు. మరికాసేపటికే రోహిత్‌ శర్మ (4) స్లిప్‌లో ఇచ్చిన క్యాచ్‌ను ఇఫ్తికార్‌ మహ్మద్‌ అందుకున్నాడు. దాంతో 10కే భారత్‌ 2 వికెట్లు నష్టపోయింది.


దూకుడుగా ఆడబోయిన సూర్యకుమార్‌ (15; 10 బంతుల్లో 2x4)ను హ్యారిస్‌ రౌఫ్‌ ఔట్‌ చేశాడు. 6.1వ బంతికి అక్షర్‌ పటేల్‌ (2) రనౌట్‌ అవ్వడంతో టీమ్‌ఇండియా 31-4తో తీవ్ర ఒత్తిడిలోకి వెళ్లిపోయింది. విరాట్‌ కోహ్లీ, హార్దిక్ పాండ్య క్రీజులో నిలబడ్డారు. సింగిల్స్‌, డబుల్స్‌ తీస్తూ బంతికి అలవాటు పడ్డారు. అందివచ్చిన బంతుల్ని బౌండరీకి పంపించారు. ఐదో వికెట్‌కు 78 బంతుల్లో 113 పరుగుల అజేయ భాగస్వామ్యం అందించారు. 10 ఓవర్లకు 45-4గా ఉన్న స్కోరును 15 ఓవర్లకు 100-4కు తీసుకెళ్లారు. ఆఖరి 30 బంతుల్లో 60 పరుగులు అవసరమైన తరుణంలో విరాట్‌ కోహ్లీ తన అనుభవాన్ని చాటాడు. చూడచక్కని షాట్లతో పాక్‌ బౌలర్లపై ఒత్తిడి పెంచాడు. సమీకరణాన్ని 12 బంతుల్లో 31గా మార్చాడు.


19వ ఓవర్‌ ఆఖరి రెండు బంతుల్ని సిక్సర్‌గా మలిచి 15 రన్స్‌ రాబట్టాడు. చివరి 6 బంతుల్లో టీమ్‌ఇండియాకు 16 రన్స్‌ కావాలి. తొలి బంతికే హార్దిక్‌ ఔటయ్యాడు. తర్వాతి 2 బంతుల్లో 3 రన్స్‌ వచ్చాయి. నోబాల్‌గా వేసిన నాలుగో బంతిని విరాట్‌ సిక్స్‌ బాదేశాడు. ఫ్రీహిట్‌ బంతికి 3 పరుగులు తీశాడు. 5వ బంతికి దినేష్ కార్తీక్ (1) ఔటవ్వడంతో 2 బంతుల్లో 2 రన్స్‌ అవసరం అయ్యాయి. బౌలర్‌ లెగ్‌సైడ్‌ వేసిన బంతిని యాష్‌ (1*) ప్రశాంతంగా వదిలేశాడు. ఆఖరి బంతిని ఫీల్డర్ల మీదుగా పంపించి సింగిల్‌ తీసి విజయం అందించాడు.ఈ విజయాన్ని ఇప్పుడు దేశమంతా కూడా అసలైన దీపావళి పండుగ లాగా సెలబ్రేట్ చేసుకుంటుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: