ఐపీఎల్ వదిలి.. ముందు ఆ పని చేయండి?
శ్రీలంక లో నెలకొన్న ఆర్థిక సంక్షోభం పై ఆందోళన వ్యక్తం చేస్తున్న ప్రపంచదేశాలు ఇక శ్రీలంకను సంక్షోభంలో ఆదుకునేందుకు ముందుకు వస్తూ ఉండటం గమనార్హం. భారత్ సైతం శ్రీలంకలో ఆర్థిక సంక్షోభం నేపథ్యంలో ప్రస్తుతం ఇంధనం తో పాటు ఆహార నిల్వలను కూడా సరఫరా చేస్తూ సహాయసహకారాలు అందిస్తూ ఉంది. ఇకపోతే ప్రస్తుతం శ్రీలంకలో రోజురోజుకీ ఆర్థిక సంక్షోభం పెరిగిపోతున్న నేపథ్యంలో ప్రజలు కూడా ప్రభుత్వ తీరును నిరసిస్తూ ఆందోళన బాట పట్టారు. ఇక ఇటీవల ఇదే విషయంపై స్పందించిన శ్రీలంక మాజీ క్రికెటర్ అర్జున రణతుంగ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
ఆర్థిక సంక్షోభం నేపథ్యంలో ప్రజలు చేస్తున్న ఆందోళనలకు క్రీడాకారులు మద్దతుగా నిలవాలని అంటూ అర్జున రణతుంగ కోరారు. శ్రీలంక ప్లేయర్లు అందరూ కూడా ఓ వారం పాటు ఐపీఎల్ను వదిలేసి తమ దేశంలోని సంక్షోభంపై స్పందిస్తే బాగుంటుంది అంటూ చెప్పుకొచ్చారు. ఏదైనా తప్పు జరిగితే నిలదీసి మాట్లాడే దమ్ము ఉండాలి అని కేవలం క్రికెటర్లు తమ లాభాల గురించి మాత్రమే ఆలోచించకూడదు అర్జున రణతుంగ వ్యాఖ్యానించారు. కాగా ఈ ఏడాది ఐపీఎల్ సీజన్ లో ఎంతోమంది శ్రీలంక క్రికెటర్లు కూడా పలు జట్లలో కొనసాగుతూ కీలకంగా రాణిస్తున్నారు అన్న విషయం తెలిసిందే.