భారత వన్డే జట్టులోకి అశ్విన్ రీ ఎంట్రీ...?

Veldandi Saikiran

ప్రస్తుతం క్రికెట్ ప్రపంచంలో ఉన్న అద్భుతమైన స్పినర్లలో రవిచంద్రన్ అశ్విన్ ముందు వరుసలో ఉంటాడు అనే విషయం తెలిసిందే. అయితే గత నాలుగేళ్లుగా అశ్విన్ టెస్ట్ క్రికెట్ కు మాత్రమే పరిమితమయ్యాడు. కానీ అనూహ్యంగా.. ఎవరు ఊహించని విధంగా ఈ ఏడాది యూఏఈ లో జరిగిన ఐసీసీ టీ20 ప్రపంచ కప్ జట్టులో ఆశ్విన్ చోటు సంపాదించుకున్న విషయం తెలిసిందే. ప్రతి ఐపీఎల్ సీజన్ లో నిలకడగా రాణిస్తున్న కారణంగా అశ్విన్ ఈ పొట్టి ఫార్మాట్ లోకి వచ్చి అందరిని ఆకట్టుకున్నాడు. దాంతో గత నెలలో స్వదేశంలో న్యూజిలాండ్ తో జరిగిన టీ20 సిరీస్ లో కూడా చోటు సంపాదించుకున్న అశ్విన్ అద్భుతమైన ప్రదర్శన కనబర్చాడు. దాంతో అశ్విన్ ను చేతన్ శర్మ నేతృత్వంలోని భారత సెలక్షన్ కమిటీ వన్డే జట్టులో చోటు కల్పించనుంది అని సమాచారం. అయితే అశ్విన్ చివరిసారిగా జూన్ 2017లో వన్డే మ్యాచ్ ఆడాడు. ప్రస్తుతం సౌత్ ఆఫ్రికా పర్యటనలో ఉన్న టీం ఇండియా టెస్ట్ సిరీస్ తర్వాత వన్డే సిరీస్ లో పోటీ పడనుంది. కాబట్టి ఈ సిరీస్ కు అశ్విన్ ను ఎంపిక చేయనున్నట్లు తెలుస్తుంది.
ఎందుకంటే... భారత కొత్త వన్డే కెప్టెన్ రోహిత్ శర్మ మరియు కోచ్ రాహుల్ ద్రవిడ్ సమక్షంలో 2023 ప్రపంచ కప్ కోసం ప్రణాళికను ఇప్పటి నుంచే ప్రారంభించింది బీసీసీఐ. ఈ వరల్డ్ కప్ భారత్‌లో జరగనుండటంతో స్పిన్నర్లకు ప్రాముఖ్యత ఉంటుంది.
అయితే భారత జట్టులో స్పిన్ ఆల్ రౌండర్ గా కొనసాగుతున్న రవీంద్ర జడేజా... ఆ మధ్య బాగా ఫిట్‌నెస్ సమస్యలతో బాధపడుతున్నాడు. అలాగే అక్షర్ పటేల్ వాయిస్ బాల్ క్రికెట్ లో ఇంకా నిరూపించుకోలేదు. ఇక యుజ్వేంద్ర చాహల్ , కుల్దీప్ యాదవ్ ప్రస్తుతం ఫామ్ లో లేరు. దాంతో 2023 ప్రపంచ కప్ కోసం ఎవరిని తయారు చేయాలి అనే సందిగ్ధంలో బీసీసీఐ పడిపోయింది. ఇటువంటి సమయంలో అశ్విన్ టీ20 క్రికెట్ లో రాణించడం సెలక్టర్లకు కొంత ఊరటనిచ్చింది. అశ్విన్ ఈ మెగా టోర్నీ కోసం సిద్ధం చేసే ముందు.. అతడిని సౌత్ ఆఫ్రికా వన్డే సిరీస్ కు ఎంపిక చేయాలనే ఆలోచనకు వచ్చారు సెలక్టర్లు. ఈ సిరీస్ లో గనక అశ్విన్ రాణిస్తే.. అతడిని ప్రపంచ కప్ కోసం సిద్ధం చేయాలని సెలక్టర్లు భావిస్తున్నట్లు సమచారం.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: