భారత్ VS సౌత్ ఆఫ్రికా : బుమ్రా డౌట్.. పుజారా ఔట్.. తెలుగు కుర్రాడికి ఛాన్స్ వచ్చేనా..?
దక్షిణాఫ్రికా గడ్డపై ఇప్పటివరకు టెస్ట్ సిరీస్ గెలవని టీమ్ ఇండియా ఈసారి ఎలాగైనా గెలవాలనే పట్టుదలతో ఉన్నది. ఈ ప్రయత్నంలోనే తొలి అడుగును విజయవంతంగా పూర్తి చేసింది. ఇదే ఊపుతో సెకండ్ టెస్ట్ కూడా గెలవాలన్న కసితోనే ఉంది కోహ్లిసేన. జనవరి 3న జోహన్నెస్‌బర్గ్ వేదికగా దక్షిణాఫ్రికాతో భారత్ రెండవ టెస్ట్ మ్యాచ్ ఆడనున్నది. సఫారీ గడ్డపై తొలి సారి టెస్ట్ సిరీస్ గెలిచే అద్భుతమైన అవకాశం రావడంతో జొహన్నెస్‌బర్గ్‌లోనే తమ లక్ష్యాన్ని అందుకోవాలి అని కోహ్లీసేన భావిస్తుంది.
ఇప్పటివరకు ఓటమి ఎరుగని వాండరర్స్ స్టేడియంలో కోహ్లీసేన అద్భుతం చేసేందుకు సై అంటోంది. రెండవ టెస్ట్ కోసం ఒకటి, రెండు మార్పులతో మరింత పకడ్భందిగా ఫైనల్ ఎలెవన్‌ను బరిలోకి దించాలని చేస్తుంది. అక్కడి వాతావరణం, ప్రత్యర్థి టీమ్ పరిస్థితులను బట్టి తుది జట్టును ఎంపిక చేయాలని టీమిండియా మేనేజ్‌మెంట్ భావిస్తున్నట్టు తెలుస్తోంది. విన్నింగ్ కాంబినేషన్‌ను మార్చడానికీ విరాట్‌కోహ్లి పెద్దగా ఇష్టపడడు. సిరీస్ గెలిచి చరిత్ర సృష్టించే అవకాశం ఉండడంతో ఏ చిన్న అవకాశాన్ని వదులుకోవద్దు అని టీమిండియా హెడ్ కోచ్ ద్రవిడ్ పక్కా స్కెచ్ వేస్తున్నాడు.
30 ఏండ్ల కాలం నుంచి సఫారీ గడ్డపై మ్యాచ్‌లాడుతున్న టీమిండియా వాండరర్స్‌లో ఇప్పటివరకు ఒక్కసారి కూడా టెస్ట్ మ్యాచ్ ఓడిపోలేదు. ఆ రికార్డును ఇప్పుడు కొనసాగించాలని కోహ్లీసేన టార్గెట్‌గా పెట్టుకున్నది. 1997లో రాహుల్ ద్రవిడ్ తొలి సెంచరీ చేయడం, 2006లో సౌతాఫ్రికా ఫస్ట్ టెస్ట్ విక్టరీ మైదానంలో వచ్చాయి. 2018లో విరాట్ ఓవర్‌సిస్ టెస్ట్ విక్టరీ కూడా మైదానం నుండే మొదలైనది.
బ్యాటింగ్‌లో పెద్దగా మార్పులుండకపోవచ్చు. ఓపెనర్లుగా కే.ఎల్.రాహుల్, మయాంక్ అగర్వాల్ ఫస్ట్ టెస్ట్ మ్యాచ్‌లో సత్తా చాటడంతో వీరి స్థానాలకు వచ్చిన ఢోకా ఏమి లేదు. ఫాంలో లేక నానా తంటాలు పడుతున్న చటేశ్వర్ పుజారాకు చోటు దక్కడం అనుమానంగా మారింది. అతనికి ఇంకా అవకాశాలు ఇవ్వడం అవసరమా..? శ్రేయస్ అయ్యర్, హనుమ విహారీలకు చోటు ఇవ్వవచ్చు కదా..? అనే అభిప్రాయం వ్యక్తమవుతొంది.
వాండరర్స్ పిచ్ స్పిన్నర్లకు పెద్దగా సహకరించదు. ఈ దిశగా కోహ్లీ ఆలోచిస్తే విహారికీ పైనల్ ఎలెవన్‌లోచోటు దక్కవచ్చు. నలుగురు ఫ్రంట్ లైన్ పేసర్లు ఫిట్‌గా ఉంటే.. అప్పుడు స్పిన్నర్ పెద్దగా అవసరం ఉండదు. ఈ పరిస్థితిలో అశ్విన్ ను తప్పించి విహారి మొగ్గు చూపుతారు ఏమో చూడాలి. సెంచూరియన్ అశ్విన్ రెండు వికెట్లు మాత్రమే తీసాడు. పిచ్‌లో ఎక్కువగా గడ్డి కనిపించడం.. స్వింగ్, సీమ్ బౌలర్లకు చాలా అనుకూలం అని సంకేతాలు వినిపిస్తున్నాయి. శార్దుల్ ఠాకూర్, ఉమేష్ యాదవ్ తుది జట్టులోకి వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఎందుకంటే శార్దూల్ తో పోల్చితే ఉమేష్ బౌలింగ్ ఫుల్ లెంగ్త్‌తో పాటు ఫేస్ కూడా ఎక్కువగా ఉంటుంది. ఎక్కువగా కోహ్లీ ఆల్‌రౌండర్లను తీసుకునేందుకు ఇష్టపడతాడు. స్టార్ బౌలర్ బుమ్రా.. మడమ గాయంతో బాధపడుతూ ఉన్నాడు. అతనికీ రెస్ట్ ఇచ్చే ఛాన్స్ ఉంది. బుమ్రా ఫిట్‌గా ఉంటే మాత్రం అతన్నే జట్టులోకి తీసుకోవడం ఖాయంగా తెలుస్తోంది. రేపు జరిగే టెస్ట్‌లో చూడాలి మరీ ఎవరికీ ఛాన్స్ వస్తుందో..