ఆట ఆడించి... ఆట పట్టించిన గేల్...!

Podili Ravindranath
వెస్టిండీస్ క్రికెట్ టీమ్‌ పేరు చెబితే చాలు... ఒకప్పుడు బాబోయ్ అనే వారు. ఇప్పుడు కూడా జట్టు సభ్యుల పేర్లు చూస్తే చాలు... వామ్మో... వీరికి బౌలింగ్ చేయాలన్నా... వీరి బౌలింగ్‌లో బ్యాటింగ్ చేయాలన్నా కూడా హడలెత్తాల్సిందే. కానీ ఇదంతా ఒకప్పటి మాట. ఇప్పుడు మాత్రం... భీకరమైన జట్టు కాస్తా... తుస్ అనేసింది కూడా. ఆడిన ఐదు మ్యాచ్‌ల్లో కేవలం ఒకటంటే ఒక్కటే మ్యాచ్‌లో గెలిచింది విండీస్ జట్టు. మిగిలిన నాలుగు మ్యాచ్‌ల్లో ఓడి... టోర్నీ నుంచి నిష్క్రమించింది. ఈ జట్టుల్లో బ్రావో, ఆండ్రూ రస్సెల్, క్రిస్ గేల్, రామ్ నారాయణ్... ఇలా ఎంతో మంది స్టార్ ప్లేయర్లు ఉన్నారు. కానీ వీరంతా విడివిడిగా సూపర్ స్టార్లే. కలివిడిగా ఉంటే మాత్రం... అంతా తుస్ మన్నారు. వీరు రిటైర్డ్ అవ్వాలంటూ డిమాండ్లు కూడా వెల్లువెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో వయో భారం, ఫామ్ కోల్పోయిన ఓపెనర్ క్రిస్ గేల్ పై ఎక్కువగా ఒత్తిడి వస్తోంది. ఇప్పటికే డ్వేన్ బ్రావో తన అంతర్జాతీయ క్రికెట్ కెరీర్‌కు వీడ్కోలు పలకగా... గేల్ కూడా అదే పని చేస్తారని అంతా భావించారు.

కానీ ఆస్ట్రేలియాతో జరిగిన చివరి లీగ్ మ్యాచ్‌లో మాత్రం... క్రిస్ గేల్ చేసిన పనులు అందరికీ ఆశ్చర్యానికి గురి చేశాయి. బ్యాటింగ్ వచ్చిన సమయంలో కానీ... ఔటైన తర్వాత కానీ.... ఆస్ట్రేలియా ఆటగాళ్లతో గేల్ వ్యవహరించిన తీరు కానీ చూస్తే... గేల్‌కు ఇదే ఆఖరి మ్యాచ్ అనుకున్నారు అభిమానులంతా. కానీ గేల్ మాత్రం ఓ బాంబ్ పేల్చారు. ఇదే ఆఖరి మ్యాచ్ కాదని.... తన సొంత అభిమానుల ముందు చివరి మ్యాచ్ ఆడాలనేది తన చిరకాల కోరిక అంటూ తన మనసులో మాటను బయట పెట్టారు గేల్. అంతకు ముందు రిటైర్మెంట్ గురించి కనీసం ఒక్క మాట కూడా చెప్పని గేల్.... బ్యాటింగ్ వచ్చినప్పటికీ నుంచి విచిత్రంగానే ప్రవర్తించాడు. గాగుల్స్‌తో బ్యాటింగ్‌కు వచ్చాడు. ఔటైన తర్వాత... అభిమానులందరికీ అల్వీదా అన్నట్లుగా అభివాదం చేశాడు. విండీస్ ఆటగాళ్లు కూడా గేల్‌కు గౌరవ వందనం సమర్పించారు. అంతా లేచి చప్పట్లు కొట్టారు. ఆస్ట్రేలియా ఆటగాళ్లను ఆత్మీయంగా ఆలింగనం చేసుకున్నాడు కూడా. కానీ ఇదంతా జస్ట్ బిల్డప్ మాత్రమే అని... చివరి మ్యాచ్ కు ఇంకా సమయం ఉందన్నారు క్రిస్ గేల్.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: