మున్ముందు ఓటీటీల్లో క్రీడ‌లు..

Paloji Vinay
క‌రోనా త‌రువాత సినిమా రంగంలో ఓటీటీ ఫ్లాట్ ఫాం కీల‌క పాత్ర పోషిస్తోంది. అలాగే ఈ ఓటీటీల ప్ర‌భావం క్రీడ‌ల‌పై కూడా ప‌డే అవ‌కాశం ఉంద‌ని ప్ర‌ముఖులు అభిప్రాయ‌ప‌డుతున్నారు. రోజురోజుకి ప్రపంచంలో సాంకేతికత భారీగా పెరుగుతుందని దీనితో క్రికెట్ లో అనూహ్య మార్పులు చోటుచేసుకుంటాయని  అభిప్రాయ‌ప‌డ్డారు టీమిండియా మాజీ కెప్టెన్ స్పిన్ దిగ్గజం అనిల్ కుంబ్లే.


  భవిష్యత్ లో డెసిషన్ రివ్యూ సిస్టమ్ (డీఆర్ ఎస్) విధానంలో కూడా మరిన్ని మార్పులు వ‌స్తాయ‌న్నారు.  అదే జరిగితే ఏ క్రీడాకారుడూ డేటా ఇంటిలిజెన్స్ ను కొట్టిపారేయలేడని తాజాగా ఓ యూనివర్శిటీ ఏర్పాటు చేసిన 'బిల్డింగ్ కాంపిటిటివ్ అడ్వాంటేజ్ త్రూ స్పోర్ట్స్ అనలిటిక్స్ అండ్ డేటా ఇంటెలిజెన్స్' అనే కార్యక్రమంలో అనిల్ కుంబ్లే పాల్గొన్నారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న ప‌లు ఆస‌క్తిక‌ర‌మైన వ్యాఖ్యలు చేశాడు.

     ఇప్పటికే డెసిషన్ రివ్యూ సిస్టమ్ (డీఆర్ ఎస్) ప్రభావం క్రికెట్ పై ఎంతగానో ఉంద‌న్నారు. కాలానికి అనుగుణంగా ఆవిష్క‌ర‌ణ‌ల‌ను మార్పుల‌ను క్రీడాకారులు అంగీక‌రించాల‌ని సూచించారు. క్రికెట్ లో సాంకేతికత అంశాలపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమైనా అది ఆటకు మంచి చేస్తుందని అనిల్ కుంబ్లే అభిప్రాయ‌ప‌డ్డారు. అందుకే అది ఆహ్వానించదగ్గ విషయమని స్పిన్ దిగ్గజం అనిల్ కుంబ్లే తెలిపారు. ఈ క్రమంలోనే క్రీడల్లోనూ ఓటీటీలు వస్తాయని జోస్యం చెప్పారు.  ఇకపై ఆటలలో టీవీలు ప్రసారదారుల ప్రభావం అధికంగా ఉండబోద‌ని చెప్పారు.

క్రీడా సమాఖ్యలు సైతం ప్రజలకు చేరువ అయ్యేందుకు సాంకేతికతను విరివిగా ఉపయోగించుకుంటారని అనిల్ కుంబ్లే ఆశాభావం వ్య‌క్తం చేశారు. ఆటలను ప్రజలకు చేరువ చేసేందుకు టీవీలు ప్ర‌ముఖ పాత్ర పోషించాయ‌ని ఇక పై ఈ కీల‌క పాత్ర ఓటీటీలు మోస్తాయ‌ని చెప్పుకొచ్చారు. ఈ మార్పుల కోసం తాను ఆసక్తిగా ఎదురుచూస్తున్నట్లు వెల్ల‌డించారు అనిల్ కుంబ్లే. అలాగే క్రికెట్ లో పరిమిత ఓవర్ల ఫార్మాట్లు పెరిగేకొద్దీ డేటా ఇంటిలిజెన్స్ వినియోగం ఎక్కువ‌వుతుంద‌ని ఊహించార‌య‌న‌. ఆటలు ఎంత చిన్నగా మారితే డేటా ఇంటిలెజెన్స్ వినియోగం అంత ఎక్కువగా ఉంటుందని అంచ‌నా వేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: