శ్రీలంక క్రికెట్ ను బీసీసీఐ అవమానించింది : మాజీ కెప్టెన్

praveen
శ్రీలంకలో జూలై 13 నుంచి వన్డేలు, టీ20లు ఆడేందుకు టీం ఇండియా వెళ్లింది. అయితే టీం ఇండియా అగ్రశ్రేణి జట్టు ఇంగ్లండ్ పర్యటనలో ఉండటంతో టీమిండియా బీ జట్టును లంక పర్యటనకు పంపించేందుకు బోర్డు నిర్ణయించింది. దీనిపై శ్రీలంక జట్టు మాజీ కెప్టెన్ అర్జున రణతుంగ స్పందించాడు. తమ దేశ జట్టుతో క్రికెట్ ఆడేందుకు భారత బీ జట్టు రావడం ఘోర అవమానం అన్నాడు. అసలు ఇలాంటి ప్రతిపాదనను ఒప్పుకున్న తమ దేశ క్రికెట్ జట్టుకు బుద్ది లేదని ఘాటు వ్యాఖ్యలు చేశాడు. డేరింగ్ ఓపెనర్ శిఖర్ దావన్ సారధ్యంలో టీమిండియా బీ జట్టు లంకతో తలపడనుంది.


లంకతో ఇండియా జట్టు మూడు వన్డేలు, మూడు టీ20ల్లో తలపడుతుంది. టెలివిజన్ మార్కెటింగ్‌లో భాగంగానే ఈ సిరీస్‌కు లంక క్రికెట్ బోర్డు ఒప్పుకుందని అర్జున రణతుంగ ఆరోపించాడు. పీటీఐతో మాట్లాడిన ఈ మాజీ క్రికెటర్ లంక బోర్డు నిర్ణయంపై తన ఆగ్రహాన్ని వ్యక్తం చేశాడు. ఈ సందర్భంగా అర్జున రణతుంగ మాట్లాడుతూ... ఇలా భారత రెండో జట్టు శ్రీలంక పర్యటనకు రావడం మా దేశ క్రికెట్‌‌ను అవమానించడమే. టెలివిజన్ మార్కెటింగ్ కోసమే లంక జట్టు ఈ సిరీస్ నిర్వహిస్తోంది. మరో వైపు భారత్ తమ మేటి జట్టును ఇంగ్లండ్ కు పంపించి... బీ జట్టును ఇక్కడకు పంపిస్తున్న తీరు బాధాకరం అని అన్నాడు. లంక క్రికెట్లో సాధించిన ఏకైక వన్డే వరల్డ్ కప్ అర్జున రణతుంగ కెప్టెన్సీలో నే వచ్చింది.


ఇక ... టీమిండియా జట్టును పరిశీలిస్తే... శిఖర్ ధావన్, పాండ్యా బ్రదర్స్, సూర్యకుమార్ యాదవ్, భువనేశ్వర్ కుమార్, యజ్వేంద్ర చాహల్, కుల్దీప్ యాదవ్ ఉన్నారు. అంతే కాకుండా ఐపీఎల్ లో సత్తా చాటిన యంగ్ క్రికెటర్లు.. దేవదత్ పడిక్కల్, రుతురాజ్ గైక్వాడ్, చేతన్ సకారియాలకు అవకాశం లభించింది. వీరందరూ బలహీన శ్రీలంకపై ఏ మేరకు రాణిస్తారో వేచి చూడాలి...

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: