క్రికెటర్ అంబటి రాయుడు హడావిడిగా రిటైర్మెంట్ ప్రకటించేశాడు. తరువాత ఏమైందో కానీ మళ్లీ బ్యాట్ పట్టుకోవాలనుకుంటున్నాడు. తనలో ఇంకా క్రికెట్ మిగిలే ఉంది అంటున్నాడు. ఆ క్రికెటర్ ఎవరో కాదు అంబటి రాయుడు. భారత వరల్డ్‌కప్ టీమ్‌లో ఎంపిక కాకపోవడంతో హడావుడిగా రిటైర్ ప్రకటించిన రాయుడు.. మళ్లీ బ్యాట్ పట్టుకోవడానికి రెడీ అయ్యాడు.
తీవ్ర నిరుత్సాహంతో కెరీర్‌కు గుడ్‌బై చెప్పిన అంబటి రాయుడు.. తన నిర్ణయాన్ని వెనక్కు తీసుకున్నాడు. జూలై నెలలో అంబటి రిటైర్మెంట్ ప్రకటించాడు. కానీ 58 రోజుల తర్వాత తన నిర్ణయాన్నిమార్చుకున్నాడు తెలుగుతేజం. రిటైర్మెంట్ నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్న రాయుడు ఈ సీజన్లో హైదరాబాద్ క్రికెట్ సంఘం నిర్వహించే పరిమిత ఓవర్ల క్రికెట్ మ్యాచ్‌లు ఆడనున్నాడు. హెచ్‌సీఏ వన్డే.. టీ20 క్రికెట్ మ్యాచ్‌లకు అందుబాటులో ఉంటానని అతను చెప్పాడు.
భారత్ జట్టులోకి 2013లో అరంగేట్రం చేసిన అంబటి రాయుడు.. మధ్యలో పేలవ ఫామ్, ఫిట్నెస్ కారణంగా టీమిండియాకి దూరమయ్యాడు. అయితే.. 2018 ఐపీఎల్ సీజన్లో చెన్నై సూపర్ కింగ్స్‌కి ఆడటం ద్వారా గాడిన పడిన ఈ తెలుగు క్రికెటర్‌కి మళ్లీ భారత్ జట్టు నుంచి పిలుపొచ్చింది. దీంతో వరల్డ్ కప్‌లోనూ నెం.4 బ్యాట్స్‌మెన్‌గా రాయుడు ఆడటం దాదాపు ఖాయమని అంతా ఊహించారు. కానీ.. ఈ ఏడాది ఆరంభంలో ఫామ్ కోల్పోయిన రాయుడి స్థానంలో వరల్డ్‌కప్‌కి విజయ్ శంకర్‌ని సెలక్టర్లు ఎంపిక చేశారు. దీంతో.. సెలక్టర్లపై రాయుడు విమర్శలు గుప్పిస్తూ రిటైర్మెంట్ ప్రకటించాడు.
హెచ్‌సీఏకి లేఖ రాసిన రాయుడు.. తన రిటైర్మెంట్ నిర్ణయం అనేది ఆవేశంలో తీసుకునిందేనని స్పష్టం చేశాడు. తాను మళ్లీ క్రికెట్ ఆడాలనుకుంటున్నట్టు లేఖలో తెలిపాడు. వచ్చే నెల 10నుంచి ఎప్పుడైనా హైదరాబాద్ జట్టుతో చేరడానికి సిద్ధమని తెలిపాడు. ఐపీఎల్లో ఆడటానికే రాయుడు తన రిటైర్మెంట్పై మనస్సు మార్చుకున్నాడంటున్నారు క్రికెట్ పండితులు.