అంతర్వేది లక్ష్మీ న‌ర‌సింహా స్వామి చ‌రిత్ర‌...!

కోన‌సీమ జిల్లాలోని రాజోలు మండ‌లం అంత‌ర్వేది ల‌క్ష్మీ న‌ర‌సింహా స్వామికి ఎంతో చ‌రిత్ర ఉంది. పూర్వకాలంలో అంతర్వేది అంత అడవిగా ఉండేది. కేశవదాసుఅనే యాదవుడు, ప్రతిరోజు తన గోవులను ఈ అడవిలో మేపుతూ ఉండేవాడు. ఈ గోవుల మందలో ఒక కపిలగోవు ఉండేది. అడవికి చేరిన వెంటనే కపిల గోవు మంద నుండి వేర్పడి, పొదలచాటుకు పోయెది. ఇంటికి పోయిన తరువాత పాలు ఇవ్వకుండా ఉండేది. కారణము తెలుసుకోవాలని యాదవుడు ఒకరోజు గోవు వెంట వెళ్ళాడు. అడవికి చేరి మందనుండి ఆ కపిల గోవు యధాప్రకారము వేర్పడి పొదల చాటున ఒక పుట్టపై క్షీర వర్షము కురిపించింది.


ఆ దృశ్యము చూసిన కేశవదాసు భయపడి భక్తితో స్వామిని స్మరించుకొని గోవులను తీసుకొని ఇంటికి వెళ్ళిపోయాడు. ఈ విచిత్ర సంఘటనకు భయపడుతూ అన్నము తినక , నిద్రరాక, ఏ అర్ధ రాత్రి సమయంలోనో నిద్రపోయాడు. శ్రీ లక్ష్మీ నరసింహస్వామి అతడికి కలలో కనిపించి ఆపుట్టలో ఉన్నది తానేనని చెప్పి, తనకు ఆలయ నిర్మాణము చేయమని ఆజ్ఞాపించి, వెళ్లిపోయారు. కేశవదాసు వెంటనే మేల్కొని, ఎప్పుడు తెల్లవారుతుంది అని ఎదురుచూసి సూర్యోదయమయ్యేసరికి గ్రామస్తులనందరినీ ఒక్కదగ్గర చేర్చి, తన గోవు సంగతి, తాను చుసిన విచిత్ర సంఘటన, వచ్చిన కల అందరికి చెప్పాడు. అతను చెప్పిన విషయం విని గ్రామస్థులందరు ఆశ్చర్య పోయారు.


అక్కడ ఉన్న ప్రజలనుండి ఒక బ్రాహ్మణుడు ముందుకువచ్చి, “బ్రహ్మ పురాణము నందు శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారిని వశిష్ట మహర్షి ఈ అంతర్వేది క్షేత్రములోనే సేవించి ప్రతిష్టించినట్లు చెప్పబడినది. శ్రీ నరసింహ స్వామీ కేశవదాసునకు కలలో కనబడి ఉంటాడు. మనమందరమ ఈ రోజున ఆ స్థలానికి వెళ్లి , పుట్టను వెతికి తరువాత ఆలయ నిర్మాణము, మిగతా ప్రయత్నాలు చేద్దాం “అని చెప్పాడు. శుభ ముహూర్తంలో గ్రామస్తులు గోవులతో అడవికి వెళ్లారు. చేరిన వెంటనే కపిలగోవు మంద నుండి విడిపోయి చెట్టు దగ్గరికి వెళ్లి పుట్టపై క్షీరవర్షము కురిపించింది.


అందరు ఆశ్చర్యపడి పుట్ట దగ్గరికి వెళ్లి కొబ్బరికాయలు పూజలు చేసి , పుట్టను త్రవ్వగా శ్రీనరసింహ స్వామి శిలావిగ్రహము లభించింది. అందరూకలిసి ఆలయాన్ని నిర్మించి, స్వామి వారి ఉత్సవాలు వైభవంగా జరిపించారు.
స్వామివారి సాక్షాత్కారాన్ని పొందిన శ్రీ మందపాటి కేశవదాసు గారు పేరుమీద కేశవదాసుపాలెం అనే గ్రామం ఏర్పడింది అలాంటి మహాభక్తున్ని గుర్తించకపోవడం బాధాకరం.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: