ఔరా..! శ్రీరామానుజ విగ్రహం.. మేడిన్ చైనా..?

హైదరాబాద్ శివార్లలో కొలువుదీరిన సమతామూర్తి విగ్రహం ఇప్పుడు టాక్‌ ఆఫ్‌ ద టౌన్‌గా మారింది. శ్రీరామానుజాచార్యుల సహస్రాబ్ది ఉత్సవాల్లో భాగంగా శంషాబాద్‌ సమీపంలోని ముచ్చింతలలో ఏర్పాటైన ఈ 216 అడుగుల విగ్రహాన్ని ఇవాళ ప్రధాని మోదీ లోకార్పణం చేయబోతున్నారు. దేశంలోని అతి పెద్ద విగ్రహాల్లో ఒకటైన ఈ విగ్రహం గురించిన విశేషాలు ఇప్పుడు ఆశ్చర్యపరుస్తున్నాయి.


అవేంటో తెలుసా.. ఈ విగ్రహం విడివిడి భాగాలుగా చైనాలో తయారైంది. ఈ విగ్రహ నమూనాను తయారు చేసిన తర్వాత తయారీ ఆర్డర్‌ ఓ చైనా సంస్థకు అప్పగించారు. చైనాలో ఈ విగ్రహం దాదాపు  1600 భాగాలుగా తయారైంది. ఇక్కడ రూపొందించిన సాఫ్ట్‌వేర్‌ ఫైల్‌ను చైనాలోని ఏరోసెన్‌ కార్పొరేషన్‌కు పంపి అక్కడ తయారు చేయించారు. విగ్రహం క్యాస్టింగ్‌, అసెంబ్లింగ్‌ పనులు  చైనాలోని ఏరోసెన్‌ కార్పొరేషన్‌కు అప్పగించారు. అక్కడ ఓ ప్రత్యేక యంత్రం సాయంతో రోబోటిక్‌ పరిజ్ఞానంతో ఈ విగ్రహాన్ని రూపొందించారు.


ఈ విగ్రహం ఒకేసారి ఏర్పాటు కాలేదు.. మొదట థర్మోకోల్‌తో 1:10 మోడల్‌ నమూనాలో విగ్రహం తయారు చేయించి పరీక్షించారు. చినజీయర్‌ స్వామి దీన్ని పరిశీలించేందుకు స్వయంగా చైనా వెళ్లి వచ్చారు. ఆయన మరికొన్ని మార్పులు చెప్పిన తర్వాత మరోసారి నమూనాను థర్మోకోల్‌తో రూపొందించారు. అలా పలుమార్పు మార్పులు చేర్పులు చేసిన తర్వాత తుది విగ్రహాన్ని తయారు చేశారు.


థర్మోకోల్‌తో 20 అడుగుల విగ్రహం తుది నమూనాను ఇక్కడి నుంచి వెళ్లిన ప్రధాన స్థపతి బృందం పరిశీలించిన ఓకే చెప్పిన తర్వాత అప్పుడు 1600 భాగాలుగా క్యాస్టింగ్ ప్రారంభమైంది. చైనా నుంచి 1600 ముక్కలుగా దాన్ని తీసుకొచ్చి.. ముచ్చింతల్‌లో అప్పటికే తయారు చేసిన స్టీల్‌ నిర్మాణంపై పొరలు పొరలుగా అతికించారు. అలా ఈ విగ్రహం రూపకల్పనలో చైనాలోని ఏరోసెన్‌ కార్పొరేషన్‌ కీలక పాత్ర పోషించింది. ఆ సంస్థకు చెందిన మొత్తం 70 మంది బృందం వచ్చి ఇక్కడ ఈ అతికించే ప్రక్రియ పూర్తి చేసింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: