కొండలరాయుని ఆర్జితసేవలు మొదలు ఎప్పటినుంచంటే?

N.Hari
తిరుమల వెంకన్న కరుణిస్తే త్వరలోనే భక్తులకు ఆ దేవదేవుడి ఆర్జితసేవలను ప్రత్యక్షంగా తిలకించే అవకాశం దక్కనుంది. కరోనా కారణంగా 21 నెలలుగా శ్రీవారి ఆలయంలో మూలవిరాట్టుకు జరిగే ఆర్జిత సేవలను ఏకాంతంగా నిర్వహిస్తోంది టీటీడీ. కరోనా బారిన పడుతున్న వారి సంఖ్య పెరగకుండా ఉండే సంక్రాంతి పండుగ తర్వాత నుంచి అర్జిత సేవలను తిలకించేందుకు భక్తులను అనుమతించాలని నిర్ణయించింది. గతంలోలా పూర్తి స్ధాయిలో భక్తులను అనుమతించకుండా పరిమిత సంఖ్యలో భక్తులను అనుమతించనున్న టీటీడి...సేవలకు హాజరయ్యే భక్తులు కచ్చితంగా కొవిడ్ నెగటివ్ వచ్చిన రిపోర్టును సమర్పిస్తేనే ఆర్జితసేవలకు అనుమతించే విధంగా నిబంధనను అమలులోకి తేనున్నదని సమాచారం.
కరోనా తీవ్రత తగ్గిన తర్వాత తిరిగి శ్రీవారి దర్శనాన్ని ప్రారంభించిన నాటి నుంచి స్వామి వారి ఆర్జిత సేవలకు అనుమతించాలని భక్తుల నుంచి డిమాండ్ వస్తోంది. ఈ నేపథ్యంలో గతేడాది ఆగస్టు 8వ తేది నుంచి టీటీడీ వర్చువల్ విధానంలో స్వామి వారి భక్తులను కళ్యాణోత్సవ సేవలో ఫాల్గొనేలా అనుమతించింది. ఆ తర్వాత దాదాపు 227 రోజుల విరామం అనంతరం గతేడాది నవంబర్ 1వ తేదీ నుంచి అర్జిత బ్రహ్మోత్సవం, డోలోత్సవం, సహస్ర దీపాలంకరణ సేవలలో కూడా భక్తులు వర్చువల్ విధానంలో ఫాల్గొనేలా అవకాశం కల్పించింది. ఇలా ఈ మూడు సేవలకు మాత్రమే భక్తులు ఆన్ లైన్‌లో పాల్గొనేలా అవకాశం కల్పించినా.. ప్రత్యక్షంగా స్వామి వారి సేవలలో పాల్గొనేలా అవకాశం కల్పించాలని భక్తుల నుంచి టీటీడీపై రోజురోజుకు ఒత్తిడి పెరుగుతోంది.
భక్తుల నుంచి వస్తున్న విఙ్ఞాపనల నేపథ్యంలో.. భక్తులను ఆర్జిత సేవలకు అనుమతించే ఆంశంపై సాధ్యాసాధ్యాలను పరిశీలించి నివేదికను సమర్పించాలని టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి ఈవో జవహార్‌రెడ్డిని ఆదేశించారు. చైర్మన్ ఆదేశాల మేరకు భక్తులను అర్జిత సేవలకు అనుమతించే అంశంపై టీటీడీ అధికారులతో ప్రత్యేకంగా ఈవో సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ప్రస్తుతం కొవిడ్‌ కేసులు తగ్గడం, వ్యాక్సినేషన్‌ ప్రక్రియ వేగవంతంగా సాగుతోంది. దీంతో గతంలోలా పూర్తి స్ధాయిలో భక్తులను ఆర్జితసేవలకు అనుమతించకుండా భౌతికదూరం పాటిస్తూ కూర్చునేలా కనీసం 30 నుంచి 40 శాతం మంది భక్తులను ఆర్జితసేవలకు అనుమతించవచ్చున్నని ఈవో చైర్మన్ దృష్టికి తీసుకెళ్లారు. ఆర్జితసేవలకు భక్తులను అనుమతించడంపై పాలకమండలిలో చర్చించిన చైర్మన్.. జనవరిలో సంక్రాంతి పండుగ ముగిశాక కేసులు పెరగకుండా ఉండే జనవరి 15వ తేదీ తర్వాత నుంచి భక్తులను ఆర్జిత సేవలకు అనుమతిస్తామని సుబ్బారెడ్డి తెలిపారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: