బోనాల పండుగ ఎందుకు జరుపుకుంటామో తెలుసా ?

VAMSI
బోనాల పండుగ వచ్చేసింది. భాగ్యనగరం పండుగను ప్రతిష్టాత్మకంగా జరుపుకునేందుకు సర్వం సిద్ధం చేస్తోంది. ఆషాఢ మాసం వచ్చిందంటే బోనాల పండుగ వైభవమే వైభవం.
బోనాలు అమ్మవారిని పూజించే హిందువులకూ ఇది ఒక ప్రత్యేకమైన పండుగ. ముఖ్యంగా ఈ పండుగ తెలంగాణ ప్రజలకు చాలా ప్రత్యేకం. ప్రపంచంలో ఎక్కడున్నా ఈ పండుగొస్తే చాలు హైద్రాబాద్ లో వాలిపోతారు. రాయలసీమలో కొన్ని ప్రాంతాల వారు ఈ పండుగను జరుపుకుంటారు. బోనం అంటే భోజనం రుచిగా, శుచిగా బెల్లంతో కలిపి వండిన వంటకం, తర్వాత బోనాల కుండలను వేప రెమ్మలతో, పసుపు, కుంకుమతో అలంకరించి దానిపై ఒక దీపం పెట్టి అమ్మవారికి నైవేద్యంగా సమర్పిస్తారు. ఇది ఎప్పటి నుంచో వస్తున్న ఆచారం. నెల రోజుల పాటు జరుపుకునే ఈ పండుగకు భక్తులు బోనాలు సమర్పించడానికి భారులు తీరుతారు. బోనాల పండుగను ఆషాడ మాసం ప్రారంభంలో మొదలు పెడతారు. ఇది ఎప్పటి నుండో ఆచారంగా వస్తోంది.
ఈ పండుగ మొదలైన రోజు అలాగే చివరి రోజున ఎల్లమ్మ తల్లిని పూజించడం ఆనవాయితీగా వస్తోంది. జాతరలో పోతురాజులు, రకరకాల వేషదారులు నాట్యం చేస్తూ సంస్కృతి సంప్రదాయాలకు అద్దం పడతారు. ఇంతకీ ఈ బోనాల పండుగ చరిత్ర ఏమిటంటే కాకతీయుల కాలం నుండి ఈ బోనాల పండుగ ఆచారంగా వస్తుందని మన పూర్వీకులు చెబుతున్న మాట. అమ్మ వారు ఆషాడమాసంలో ఆడపడుచుగా పుట్టింటికి వస్తుందని ఆమెకు ఎంతో ఇష్టమైన పిండివంటలను వండి కొత్త కుండలో నైవేద్యంగా సమర్పించడమే బోనాల పండుగ అని చెబుతుంటారు.  ఇక్కడ మరో విషయం  ఏమిటంటే 1869 లో సికింద్రాబాద్, హైదరాబాద్ జంట నగరాల్లో మలేరియా వ్యాధి ప్రబలి ఎంతో మంది తమ ప్రాణాలను కోల్పోయారు.
ఇదంతా అమ్మవారికి ఆగ్రహం వచ్చినందుకే జరిగిందని భావించిన ప్రజలు అప్పటి నుండి ప్రతి సంవత్సరం ఉత్సవాలు జాతరలు జరిపించాలని నిర్ణయించుకున్నారు. ఆ విధంగా వచ్చినదే బోనాల జాతర. ఈ పండుగ వెనకున్న ప్రదాన కారణం మలేరియా, మశూచి వంటి అంటువ్యాధులు ప్రబలకుండా.. ప్రకృతి ప్రళయాలను  సృష్టించకుండా తమని, తమ కుటుంబాలను, పాడి పంటలను రక్షించమని అమ్మవారిని వేడుకుంటూ ఈ వేడుకలు జరుపుతారు. ఈ రోజు నుండి హైదరాబాద్ లో బోనాలు ఎంతో అట్టహాసంగా ప్రారంభమయ్యాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: