ఈరోజు యశోద జయంతి
ఒకానొకప్పుడు బ్రహ్మ ఈ ద్రోణుడు , ధరలను పిలిచి , ‘ఒక ప్రయోజనం కోసం మీరు భూలోకంలో జన్మించాలని’ కోరతాడు. అప్పుడు వాళ్ళు ‘వెళ్తాం. కానీ అక్కడ మాకు నిరంతరం విష్ణువును సేవించే అవకాశమివ్వాలని’ ప్రతిగా కోరుతారు. అంతేకాక , వీరికి సంతానం లేనందున త్వరగా అనుగ్రహమిచ్చే గంధమాదన అనే పర్వతం దగ్గర విష్ణువును ప్రార్థిస్తారు. కానీ , విష్ణువు అనుగ్రహం , పలుకు దొరకనందున వారు అక్కడే అగ్నిలో ఆహుతై పోయారు. అప్పుడు అశరీరవాణి ‘శ్రీమహావిష్ణువే మీకు కుమారుడుగా లభ్యమవుతాడని’ చెప్పిందట. అలా , వారు బ్రహ్మ కోరిక మేరకు భూలోకంలో నందగోకులంలో జన్మించడం , కృష్ణున్ని సంతానంగా యోగమాయ స్థానంలో పొందడం జరిగింది.
యశోద ఒడిలో పడుకొని పాలు తాగుతున్న కృష్ణుడు పెద్దగా ఆవులిస్తాడు. అప్పుడు ఆ నోటిలో బ్రహ్మాండమంతా కనపడింది. ఇంకోసారి ‘మన్ను తిన్నాడని’ మందలించి నోరు తెరవమంటుంది. అప్పుడూ ఆ నోటిలో బ్రహ్మాండాన్నంతా మళ్లీ చూసింది. యశోద అనుభవించిన ఈ ‘అద్భుతానంద దర్శనభాగ్యం’ మరే తల్లికీ దక్కలేదు. దేవదేవుని ఎన్ని మాయలో , మరెన్ని అద్భుతాలో చూసింది , అనుభవించింది ఆ తల్లి. ‘కలయో , వైష్ణవ మాయో , నే యశోదనో కానో’ అనుకుంది. పాలకుండ పగులగొట్టిన కొడుకును కోపంతో కొట్టలేదు , తిట్టలేదు. అట్లాగని ఊరుకోలేదు. ఎందుకంటే , గోకులానికి పాలంటే పవిత్రం. అవి కింద పడితే చేతితో తుడుస్తామే తప్ప కాలితో తొక్కం. అలాంటి పాలు కింద ఒలక పోశాడని దుఃఖంతో ఏం చేయాలో తోచక తిట్టలేక , కొట్టలేక , తాడుతో కట్టేయాలని అనుకున్నప్పుడు ఇంట్లో ఉన్న తాళ్ళన్నీ తెచ్చింది. కట్టేయడానికి రెండంగుళాలు తక్కువైనాయి. చివరకు ‘నేను నిన్ను పట్టుకోలేను. పట్టుబడరా!’ అందట. ఆ రెండే ‘అహంకార, మమకారాలు’. ఎప్పుడైతే పరిపూర్ణ శరణాగతి అయ్యిందో అప్పుడే పట్టుబడ్డాడు. పెంచిన ప్రేమ అనగానే యశోదనే అనుకుంటాం. ఒక్కోసారి ‘కన్నవాళ్ళ ప్రేమకంటే పెంచిన ప్రేమ ఎక్కువ’ అనేదికూడా ఈ తల్లివల్లే లోకానికి తెలిసింది. తల్లిదండ్రులే ఇలలో ప్రత్యక్ష దైవాలని , వారి రుణం తీర్చుకోలేమని కొడుకుగా శ్రీకృష్ణుని జీవితం , పెంచితేనే ప్రేమ ఉంటుందని నిరూపించిన తల్లిగా యశోద జీవితం మానవాళికి ఎల్లకాలం ఆదర్శప్రాయాలే.