ఇలా చేస్తే మీకు బోలెడంత పుణ్యం వస్తుంది...?
‘న్యాయార్జిత విత్తం’ కొబ్బరికాయలో నీరులా వచ్చి చేరుతుంది. అది ఆరోగ్యకరం, రుచికరం. అధర్మ సంపాదన కుండలో నీరు వంటిది. అది ఏనాటికైనా నేలపాలు కాక తప్పదు. ...వామనావతార ఘట్టంలో బలి చక్రవర్తి ఏం చెప్పాడు? ‘కారే రాజులు రాజ్యముల్ కలుగవే!... వాళ్లంతా సిరి మూటగట్టుకొని పోగలిగారా? ఈ భూమి మీద వాళ్ల పేరైనా మిగిలి ఉందా? కానీ మహా త్యాగమూర్తులైన శిబి చక్రవర్తి వంటి వారిని మాత్రం మరచిపోలేదు గదా’ అని గురువుకే హితోపదేశం గావించాడు. ...
‘నువ్వు తిన్నది నేలపాలు, ఇతరులకు పెట్టింది నీ పాలు’ అని లోకోక్తి. ‘లక్షాధికారైన లవణమన్నమే గాని, మెరుగు బంగారంబు మింగబోడు’ అంటారు. ఒకరికి ఇవ్వకుండా, తాను అనుభవించకుండా ఉంటే అది తుదకు దొంగలపాలే లేదా...పరులపాలు అవుతుంది. పాత్రతనెరిగి దానం చేయాలి. అపాత్రదానం అపాయకరం. అసలు దానం పుచ్చుకోవడాన్నేతప్పుపడతాయి ధర్మశాస్త్రాలు. ‘అపరిగ్రహణం’ అనేది ఒక ఉత్తమ వ్రతం. ఎవరినీ యాచించి ధనం తీసుకోకపోవడమే ఈ వ్రత లక్షణం.
ఒకవేళ తీసుకోవలసి వస్తే, ముందుగా దాత చేతిలో ఏదైనా పెట్టి, తరవాతే పుచ్చుకోవాలంటారు. భార్యామణి బలవంతంపై కుచేలుడు శ్రీకృష్ణుణ్ని అర్థించడానికి వెళ్ళాడు. తీరా అక్కడికి వెళ్ళిన తరవాత నోరు పెగలలేదు. ...తీసుకెళ్ళిన అటుకుల్ని ఇస్తే కృష్ణుడు ఆప్యాయంగా భుజించాడు. కుచేలుడు తానుగా యాచించలేదు. పరమాత్మ దయ ప్రసరిస్తే ఎవరికి ఏ సమయంలో ఏది లభించాలో అది లభించకుండా ఉంటుందా. కాబట్టి దానం చేసేముందు ఎవరికి చేయాలో తెలుసుకుని చేయడం ఉత్తమం.