శ్రీ కృష్ణుడి లీలలు చూడతరమా... !!

Suma Kallamadi
కృష్ణాష్టమి రోజున మన ఇంట్లో ఉన్న పిల్లలను చిన్ని కృష్ణుడు, గోపికల  వేషధారణలో అలంకరించుకుని మురిసిపోతుంటాము. అలాగే బాల కృష్ణుడు మన ఇంట్లోకి రావాలని కన్నయ్య పాదాలను మన ఇంట్లో ఉన్న చిన్ని కృష్ణయ్య పదాలతో లోపలికి అడుగులు వేయిస్తాం.కృష్ణుడి రూపం చూస్తే చాలు ఎంతటి వాళ్ళు అయినా కళ్ళు ఆర్పకుండా చూస్తూనే ఉంటారు.అందుకే మన కృష్ణయ్య అందానికి గోపికలు సైతం మైమరచిపోతారు. చేతిలో మురళి, తలలో నెమలి పించాలతో, రకరకాల దండలతో అందరి మదిలో చెదరని ముద్రలా ఉంటాడు కన్నయ్య. అలాగే కృష్ణాష్టమి రోజున రాత్రికి ఉట్టి ఎందుకు కొడతారో చాలామందికి తెలియదు.. అలానే కృష్ణుడు వెన్న దొంగ అన్న విషయం చాలా మందికి తెలుసు.. కానీ ఇళ్లలోకి వెళ్లి పైన ఉన్న కుండని పగలకొట్టి వెన్న ఎందుకు దొంగతనంగా తినేవాడో చాలా మందికి తెలియదు.. ఇప్పుడు ఆ విషయాల గూర్చి అలాగే కృష్ణుడి లీలలలోని అంతరంగాన్ని తెలుసుకుందాం.. !!


శ్రీ కృష్ణుడికి వెన్న ముద్దల అంటే ఇష్టం అని మనందరికీ తెలుసు. కృష్ణుడు తన స్నేహితులతో కలిసి వెన్నముద్దలు దొంగలించడం కోసం ఇళ్లల్లోకి ప్రవేశించే వాడు. అలా వెన్నముద్దలు దొంగతనం చేసే విషయంలో  కూడా మన అందరికీ తెలియని దైవ రహస్యం ఒకటి ఉంది. అలా వెన్న కోసం శ్రీకృష్ణుడు ఇంటిలో కి వెళ్ళినప్పుడు గోపికలు వెన్నని కుండలో భద్రపరిచి అందకుండ పైకి కట్టే వాళ్ళు. కృష్ణుడు స్నేహితుల సహాయంతో ఆ కుండని పగలకొట్టి వెన్నని తినేవాడు.  ఇందులో ఒక మర్మం ఉంది అంటే మనుషులలో ఉండే స్వార్ధాన్ని, మొండితనాన్ని, అహంకారాన్ని పటాపంచలు చేసి వెన్న రూపంలో తీసుకోవడం అనేది ఇందులోని అర్థం.


అలాగే కృష్ణాష్టమి రోజున ఉట్టి కొట్టడం  ఆనవాయితీగా వస్తుంది దీనికి గల రహస్యమేమిటంటే శ్రీకృష్ణుడు తన చిన్నతనంలోనే తన తోటి స్నేహితులతో కలిసి స్నేహితుల సహాయంతో పైకి ఎక్కి కుండను పగలకొట్టేవారు. ఇప్పుడు దాన్నే మనం  ఉట్టి కొట్టడం అని అంటున్నాము. ఇలా ఉట్టి కొట్టే వాళ్ళని గోవిందుడు అని పిలుస్తారు. ఇలా ఉట్టి కొట్టడానికి గోవిందుడు అన్ని విధాలా ప్రయత్నిస్తాడు కానీ దాన్ని అందకుండా స్నేహితులు వెనక్కి లాగుతూ ఉంటారు అన్నమాట. చివరికి అందరూ కలిసి ఒక దగ్గరకు చేరి ఉట్టి కొట్టి విజయాన్ని సాధిస్తారు. అంటే ఏంటంటే మన జీవితంలో కూడా ఒక  ఒక లక్ష్యం కోసం పట్టుదలతో ప్రయత్నించి అందరితో కలుపుగోలుగా ఉంటూ అందరి సహాయం తీసుకుని విజయం పొందాలని దీనిలోని పరమార్ధం. అందుకే శ్రీ కృష్ణుడి లీలలే వేరు కదా.. అని అంటారు అందరు.. !!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: