మానవాళికి పరమార్థాన్ని బోధించే కృష్ణాష్టమి విశేషాలివే...?

నేడే కృష్ణాష్టమి. శ్రావణమాసం లో వచ్చే బహుళ అష్టమి రోజున శ్రీ కృష్ణుడు జన్మించాడు. శ్రీ కృష్ణుడు జన్మించిన రోజునే గోకులాష్టమి, కృష్ణాష్టమిగా జరుపుకుంటాం. సాధారణంగా హిందువులు ఏ పండుగకైనా ఉదయం సమయంలో పూజలు ప్రారంభిస్తారు. కానీ కృష్ణాష్టమికి మాత్రం మధ్యాహ్నం నుంచి పూజలు ప్రారంభమవుతాయి. హీందూ ధర్మంలో అతి ముఖ్యమైన భగవద్గీతను కృష్ణావతారంలో బోధించడం జరిగింది.
 
భగవద్గీత ప్రకారం కృష్ణుడికి 8 మంది భార్యలు, 16,000 మంది గోపికలు ఉన్నారు. కృష్ణుడు ద్వాపర యుగంలో జన్మించాడు. చిన్నతనంలో నందగోకులంలో పెరిగిన చిన్ని కృష్ణుడు పాలు, పెరుగు, వెన్న వంటి వాటిని ఆరగించేవాడని, గోపకాంతల మధ్య రాస క్రీడలు జరిపే వాడని చాలా కథలు ప్రచారంలో ఉన్నాయి. భాగవతంలో శ్రీ కృష్ణుడి లీలల గురించి విసృతంగా ప్రస్తావించబడింది. దుష్ట రాజులు ప్రజలను పీడిస్తూ ఇబ్బందులపాలు చేస్తున్న సమయంలో దేవతలు వైకుంఠానికి వెళ్ళి భూలోకానికి వచ్చిన ఆపదను నిర్మూలించాలని మహా విష్ణువును కోరారు.
 
వారి ప్రార్థనలను మన్నించిన విష్ణుమూర్తి భూలోకంలో కృష్ణునిగా అవతరించి, దుష్ట సంహారం చేసి, మానవాళికి శాంతిని చేకూర్చినాడు. కృష్ణుడు రుక్మిణి, సత్యభామ, జాంబవతి, నాగ్నజితి, కాళింది, మిత్రవింద, భద్రాదేవి, లక్ష్మణ అనే 8 మంది భార్యలను వివాహం చేసుకున్నాడు. విలక్షణమైన అవతార పురుషుడుగా సంకీర్తితుడైన కృష్ణుడు భగవంతునిగా మాయలను చూపి అందరినీ ఆశ్చర్య చకితులను చేశాడు. దేవకి గర్భంలో జన్మించిన కృష్ణుడు యశోదా దేవి ప్రియ పుత్రునిగా పెరిగాడు.
 
పైకి ఆటలలా కనబడే కృష్ణుడి లీలలలో ఎంతో పరమార్థం ఉంది. ధర్మ మార్గంలో ప్రయాణిస్తున్న పాండవులకు కృష్ణుడు చేయూతనందించాడు. సమస్త మానవాళిని సన్మార్గంలో నడిపే విధంగా భగవద్గీతను అర్జునుడికి బోధించాడు. వైష్ణవాలయాలలో కృష్ణాష్టమి రోజున విశేష పూజలు జరుగుతాయి. ధర్మపక్షపాతిగా, జగద్రక్షకునిగా, మోహనాకారునిగా కృష్ణుడు ఈ లోకానికి మార్గదర్శకుడయ్యాడు. సకల జీవకోటిని చల్లగా కాపాడిన అవతారమూర్తి శ్రీ కృష్ణుడి జన్మదినాన్ని కృష్ణాష్టమిగా జరుపుకుంటాం.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: