శివః : శివుడు మెడలో సర్పాన్ని ఎందుకు ధరించాడో తెలుసా...?

శివుని మెడలో నాగాభరణమై ఉన్న మహాసర్పం వాసుకి. నిరంతరం ఈశ్వరుని సేవలోనే వాసుకి తరిస్తాడు. శివుడి ఆభరణంగా వాసుకి మారడానికి ముఖ్యమైన కారణం ఉంది. కశ్యప ప్రజాపతికి 14 మంది భార్యలు ఉండగా 14 మంది భార్యలలో కద్రువ, వినతలు ముఖ్యులు. గరుత్మంతుడు, అనూరుడు వినతకు జన్మించారు. ఈ ఇద్దరు కుమారులలో ఒకడైన అనూరుడు సూర్యుని రథసారథిగా బాధ్యతలు నిర్వహిస్తుంటాడు. 
 
కశ్యప ప్రజాపతి భార్య కద్రువకు వెయ్యి మంది సర్పాలు సంతానం. వీరిలో ఆధిశేషువు పెద్దవాడు. ఒకరోజు పాలసముద్రం సమీపంలోని గుర్రాన్ని దూరం నుండి చూసిన కద్రువ వినతతో గుర్రం తోక నల్లగా ఉందని చెబితే వినత మాత్రం గుర్రం తోక నల్లగా లేదని తెల్లగానే ఉందని చెబుతుంది. కద్రువ గుర్రం తోక నల్లగా ఉంటే నా దగ్గర వేయి సంవత్సరాలు పరిచారికగా ఉండాలని గుర్రం తోక తెల్లగా ఉంటే నేనే నీ దగ్గర వెయ్యి సంవత్సరాలు బానిసగా ఉంటానంటూ పందెం కాస్తుంది. 
 
రాత్రి కావడంతో పొద్దున పరీక్షించాలని వారు వెళ్లిపోగా కద్రువ గుర్రం తోక తెల్లగా ఉండటం గమనించి పందెం ఎలాగైనా నెగ్గాలని తన కుమారులైన సర్పాలను పిలిచి నల్లగా ఉన్నవారు గుర్రం తోకను చుట్టుకోవాలని కోరగా వారు దానికి అంగీకరించరు. కోపంతో కద్రువ భవిష్యత్తులో జరిగే సర్ప యాగంలో మీరు నశించిపోతారు అని చెబుతుంది. ఆ శాపంతో భయపడిన కొన్ని సర్పాలు వెళ్లి గుర్రం తోకను చుట్టుకోవడంతో గుర్రం తోక నల్లగా ఉందని వినత కద్రువ దగ్గర దాసిగా పని చేస్తుంది. ఆ తరువాత వినత కుమారుడైన గరుత్మంతుడు ఆమెకు బానిస బంధనాల నుండి విముక్తి కలుగజేస్తాడు. 
 
తల్లి ప్రతిపాదనను అంగీకరించని ఆదిశేషువు శ్రీమహావిష్ణువు కోసం ఘోర తపస్సు చేయగా శ్రీ మహావిష్ణువు ప్రత్యక్షమై ఆదిశేషువును శేషాతల్పంగా చేసుకుంటాడు. ఆదిశేషువుకు మృత్యు భయం లేకుండా పోవడంతో వాసుకి మహా శివుని కోసం తపస్సు చేయగా శివుడు ప్రత్యక్షమై వాసుకిని తన మెడలో నాగాభరణంగా చేసుకుంటాడు. శివుడు మృత్యుంజయుడు కావడంతో వాసుకికి మృత్యువు దరిలోకి రాకుండా పోయింది. ఆరోజు నుండి మహాశివుని మెడలో వాసుకి దర్శనమిస్తున్నాడు. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: