విజయవాడలోని కనక దుర్గ అమ్మవారి దసరా నవరాత్రి ఉత్సవాలు ఈ నెల 29 నుంచి ప్రారంభమవుతున్నాయని రాష్ట్ర దేవాదాయశాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ తెలిపారు. శనివారం దుర్గ గుడి ఉత్సవాలపై కలెక్టర్ క్యాంప్ కార్యాలయంలో మంత్రి సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో ఎమ్మెల్యే మల్లాది విష్ణు, ఈఓ సురేష్ బాబు, కలెక్టర్ ఇంతియాజ్, జాయింట్ కలెక్టర్ మాధవిలత పాల్గొన్నారు. ఈ సందర్బంగా నవరాత్రులకి సంబందించిన బ్రోచర్ ని మంత్రి వెల్లంపల్లి ఆవిష్కరించారు. అనంతరం అయన మాట్లాడుతూ.. గత ప్రభుత్వంలో జరిగిన దసరా నవరాత్రులలో భక్తులు చాలా ఇబ్బంది పడ్డారు. ప్రతి ఒక్క భక్తుడికి అమ్మవారి దర్శనం ఇబ్బంది లేకుండా జరిగేలా అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పారు. దానికోసమే కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో అన్ని డిపార్టుమెంట్ల అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించామని మంత్రి స్పష్టం చేశారు. దసరా ఉత్సవాలని ఘనంగా నిర్వహించేలా అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పారు.
మంత్రి ఇచ్చిన ఆదేశాల మేరకు జాబ్ కార్డ్ తయారుచేసి ఆయా డిపార్ట్మెంట్ లకి ఇవ్వడం జరుగుతుందని కలెక్టర్ ఇంతియాజ్ తెలిపారు. ఎన్ సీసీ కాండిడేట్లను 2 వేలమందిని అదనంగా నియమిస్తున్నామని చెప్పారు. ఈ నెల 29 నుండి వచ్చే నెల 8 వ తేదీ వరకు వరకు దసరా ఉత్సవాలు జరుగుతాయని దుర్గా మల్లేశ్వర స్వామి దేవాలయం ఈవో ఎం.వి.సురేష్ బాబు తెలిపారు. దీనికి సంబంధించి అన్ని ఏర్పాటు పూర్తిస్థాయిలో చేశామని చెప్పారు. మొదటిరోజు స్నపనాభిషేకం అనంతరం ఉదయం 9 గంటలకు దర్శనాన్ని ప్రారంభిస్తామన్నారు.మిగతా రోజుల్లో ఉదయం 3 గం నుండి రాత్రి 11 వరకు వరకు దర్శనం ఉంటుందని చెప్పారు. మూల నక్షత్రం రోజు ఉదయం రెండు గంటల నుండి రాత్రి 11 గంటల వరకు దర్శనం ఉంటుందన్నారు. దుర్గ గుడికి వచ్చే భక్తులకు ఇబ్బంది లేకుండా క్యూలైన్లను ఏర్పాటు చేశామన్నారు.
కొండ కింద ఉన్న వినాయకుడి దగ్గర నుండి క్యూ లైన్ ఏర్పాటు చేశామని చెప్పారు. అన్ని క్యూ లైన్లో వాటర్ ప్యాకెట్, షామియానా, విద్యుత్ దీపాలను ఏర్పాటు చేశామన్నారు. భక్తులకు ఎటువంటి అసౌకర్యం లేకుండా అన్ని ఏర్పాట్లను పూర్తి చేశామన్నారు. ముఖ్యమైన ప్రదేశాలు నుంచి మైకు ప్రచార కేంద్రం కూడా అందుబాటులోకి తేనున్నట్టు తెలిపారు. భక్తుల భద్రత దృశ్య సీసీ కెమెరాలను, జిల్లా కలెక్టర్ , పోలీస్ కమిషనర్ ఆధ్వర్యంలో కంట్రోల్ రూమ్ లను ఏర్పాటు చేసినట్టు చెప్పారు. వృద్దులు మరియు దివ్యాంగులకు ప్రత్యేక వాహనాలు వైపుకు రాజీవ్ గాంధీ పార్కు , రైల్వే స్టేషన్ వద్ద దేవా లయం సంబంధించిన ఉచిత బస్సు సదుపాయాన్ని సమకూర్చుతున్నట్టు చెప్పారు. అంతేకాకుండా ఉచిత ప్రసాదం కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేశామన్నారు.