బోగి నాడు గౌరీదేవికి పూజలు ఎలా చేయాలి ?

Durga
పుష్యమాసంలో, హేమంత ఋతువులో, శీతగాలులు వీస్తూ మంచు కురిసే కాలంలో సూర్యుడు మకరరాశిలోకి మారగానే వచ్చే మకర సంక్రాంతికి ఎంతో ప్రాముఖ్యం ఉంది. ఇది జనవరి మాసంలో వస్తుంది. మకర సంక్రాంతి రోజున, అంటే జనవరి 14 తేదీన సూర్యుడు ఉత్తరాయణ పథంలో అడుగుపెడతాడు. ఈరోజు నుంచి స్వర్గద్వారాలు తెరచి ఉంటాయని పురాణాలు చెబుతున్నాయి. దేశంలో పెద్ద పండుగగా అన్ని ప్రాంతాల వారూ జరుపుకునే సంక్రాంతి పండుగ ముందు రోజును భోగి అంటారు. ఈ రోజున వివిధ కూరగాయలు, పాలు పోసి పులగాలు (పొంగలి) వండుతారు. ఈ భోగినాడే గొచ్చి గౌరీవ్రతం అనే వ్రతాన్ని ప్రారంభిస్తారు. భోగినాటి సాయంకాలం వేళ ఇంట్లో మండపాన్ని నిర్మించి అలంకరిస్తారు. ఆ అలంకరణలో పండ్లు, కూరగాయలు, చెరకు గడల లాంటి ప్రధానం వాడుతారు. మండపం మధ్యలో బియ్యం పోసి దాని మీద బంకమట్టితో చేసిన గౌరీ ప్రతిమను ఉంచుతారు. పూజ పూర్తి అయిన తర్వాత గౌరీదేవికి మంగళహారతులు పాడి ఆ రాత్రికి శయనోత్సవాన్ని చేస్తారు. ఆ మరునాడు అంటే మకర సంక్రాంతి నాడు ఉదయం సుప్రభాతంతో దేవిని మేల్కొలుపుతారు. ఇలా మూడు రోజుల పాటు జరిగే ఈ ఉత్సవంలో సాయంకాలం వేళ ముత్తైదువులను పేరంటానికి పిలుస్తారు. నాలుగోరోజు గౌరీదేవికి పూజ అనంతరం ఉద్వాసన చెబుతారు. మంటపానికి అలంకరించిన కూరగాయలను నాలుగోరోజున కూర వండుతారు. ఇలా చేసిన కూరనే గొచ్చికూర అని అంటారు. ఆ తర్వాత గొచ్చి గౌరి ప్రతిమను చెరువులో గానీ, నదిలో కానీ నిమజ్జనం చేస్తారు. భోగినాడు ప్రారంభమైన ఈ వ్రతాన్ని కొంతమంది నాలుగు రోజులు, మరికొంతమంది ఆరు రోజులు చేయడం కూడా ఆచారం. భోగినాడు బొమ్మల కొలువు పెట్టడం కూడా వ్రత విధానంగానే ఆచరిస్తారు. అలాగే భోగి పండుగ రోజు చిన్నపిల్లలకు భోగిపళ్ళు పోయడం లాంటి వాటితో, పేరంటాలతో కళకళలాడుతూ ఉంటుంది. ఇంద్రుడు ప్రీతికోసం ఈ పండుగ జరుపుతుంటారు. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: