జగ్గయ్య కొంగర సీతారామయ్య, రాజ్య లక్ష్మమ్మ దంపతులకు డిసెంబర్ 31, 1928లో గుంటూరు జిల్లాలోని తెనాలికి సమీపంలో ఉన్న మొరంపుడి గ్రామంలో జన్మించారు. దుగ్గిరాలాలో ఉన్నత పాఠశాలలో చదువుకుంటున్న రోజుల్లో ఓ హిందీ నాటకంలో లవుడు పాత్రలో జగ్గయ్య మొదటిసారిగా నటించారు. అప్పటికి ఆయన వయస్సు 11 సంవత్సరాలు. అతను కాలేజీ డేస్ లో పాపులర్ చిత్రకారుడు అయిన అడవి బాపిరాజు వద్ద చిత్రలేఖన కళలో ట్రైనింగ్ పుచ్చుకొని ఎన్నో అద్భుతమైన చిత్రలేఖనాలు గీసి అందరి చేత శభాష్ అనిపించుకున్నారు.
గుంటూరులోని 1942 లో ఆంధ్ర-క్రిస్టియన్ కాలేజీలో బి.ఏ. పూర్తి చేసిన అనంతరం అతను దేశాభిమాని అనే పత్రికలో ఒక జర్నలిస్టుగా చేరారు. తరువాత ఆంధ్రా రిపబ్లిక్ వారపత్రికకు సంపాదకుడిగా పనిచేశారు. జగ్గయ్య తన బి.ఏ. కాలేజీ రోజుల్లో ఎన్.టి. రామారావుతో కలిసి అనేక నాటకాల్లో నటించారు. కొంతకాలం దుగ్గిరలాలో ఉపాధ్యాయుడిగా పనిచేసిన తరువాత, అతను రేడియోలో 3 సంవత్సరాలు వార్తలు చదివే ఉద్యోగం చేశారు.
జగయ్య త్రిపురనేని గోపీచంద్ దర్శకత్వంలో వచ్చిన ప్రియురాలు సినిమాతో వెండితెరకు పరిచయం అయ్యారు. తర్వాత 3 సినిమాల్లో నటించే అవకాశం రావడంతో న్యూస్ అనౌన్సర్ ఉద్యోగానికి రాజీనామా చేశారు. అయితే ఆయన నటించిన ఆదర్శం, పాలేరు రెండు చిత్రాలు కూడా డిసాస్టర్స్ అయ్యాయి. 1955లో బి.ఎన్.రెడ్డి దర్శకత్వంలో వచ్చిన బంగారు పాప సినిమాలో పాతికేళ్ళ వయసున్న జగ్గయ్య 60-70ఏళ్ల వృద్ధుడు పాత్రలో నటించారు. ఆ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ కావడంతో దానికి కొందరు సినిమా విమర్శకులు సమీక్షలు రాశారు. ఖాసా సుబ్బారావు అనే ఒక పాత్రికేయుడు జగయ్య కనబరిచిన నటనా ప్రతిభను మెచ్చుకుంటూ జగయ్య చాలా బాగా నటించారని కితాబిచ్చారు.
అర్ధాంగి సినిమాలో ప్రతినాయకుడిగా కనిపించి తాను ఎటువంటి పాత్రనైనా అవలీలగా పోషించగలనని చెప్పకనే చెప్పారు. కృష్ణ హీరోగా నటించిన అల్లూరి సీతారామరాజు సినిమాలో రూథర్ ఫర్డ్ పాత్ర అత్యద్భుతంగా పోషించి సర్వత్రా ప్రశంసలు అందుకున్నారు. గంభీరమైన కంఠం గల జగయ్య 100 సినిమాలకు పైగా డబ్బింగ్ చెప్పారు. జురాసిక్ పార్క్ అనే హాలీవుడ్ సినిమా యొక్క తెలుగు అనువాదంలో కూడా ఆయన డబ్బింగ్ చెప్పారు. కంచు కంఠం వలన ఆయనకు "కళా వాచస్పతి"(లార్డ్ ఆఫ్ స్పీచ్) అనే బిరుదు కూడా వచ్చింది.
జగయ్య సినిమాల్లో మాత్రమే కాదు రాజకీయ రంగప్రవేశం చేసి ప్రజలకు సేవలు కూడా అందించారు. 1967లో లోక్‌సభకు జరిగిన ఎన్నికలలో ఒంగోలు నియోజక వర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ తరుపున పోటీ చేసిన జగ్గయ్య 80 వేల ఓట్ల మెజారిటీతో ఘనవిజయం సాధించారు. జగ్గయ్య మార్చి 5, 2004వ సంవత్సరంలో గుండెపోటుతో బాధపడుతూ చనిపోయారు.