మొక్కలకు ప్రాణం ఉందని నిరూపించిన జగదీష్ చంద్రబోస్...
కేంబ్రిడ్జ్‌లో క్రైస్ట్ కళాశాల వారందించిన స్కాలర్‌షిప్‌తో కేంబ్రిడ్జ్ ట్రైపాస్‌తో పాటు లండన్ విశ్వవిద్యాలయంలో బి.ఎస్.సి. ని సాధించాడు. స్వదేశానికి వచ్చిన తరువాత బోసు అప్పటి వైస్రాయి లార్డు రిప్పన్ సహాయంతో కలకత్తా ప్రెసిడెన్సీ కళాశాలలో ప్రొఫెసర్‌గా చేరారు. ఈ సమయంలో ఆయన ఎన్నో కష్టాలను ఎదుర్కొన్నారు.తన పరిశోధనకి కావాల్సిన చిన్నపాటి పరికరం కూడా అక్కడ ఉండేది కాదు. దీనికి తోడు ఆంగ్లేయ అధికారుల నుండి కూడా అతనికి అవమానాలు ఎదురయ్యాయి. తక్కిన ఆంగ్ల ప్రొఫెసర్‌లతో పాటు కాకుండా బోస్‌కి చాలా తక్కువ జీతాన్ని ఇచ్చేవారు. స్వాభిమానపరుడైన బోస్ దీన్ని సహించలేదు. అసలు జీతమే తీసుకోకుండా మూడు సంవత్సరాల పాటు కృషిచేశాడు. తన పరిశోధనకు అవసరమైన పరికరాలను ఇతరులపై ఆధారపడకుండా స్వహస్తాలతో తయారు చేసుకున్నాడు.
తన వృత్తికి భంగం కలగకుండా కొత్త పరికరాలతో ఆయన చేసిన విద్యుదయస్కాంత తరంగాల పరిశోధనలు, ఆయన సాధించిన ఫలితాల పత్రాలకు ఏ పరీక్షా లేకుండానే 1896లో డిఎస్‌సి (గౌరవ డాక్టరేటు)ని ఇంగ్లండు విశ్వవిద్యాలయం ఇచ్చింది. వైర్‌లెస్ విధానంతో గంట మ్రోగించుట, పిస్టల్ పేల్చుట వంటివి బహిరంగంగా ప్రదర్శించినపుడు అప్పటి బెంగాల్ గవర్నర్ లార్డ్ మెకంజీ ముగ్దుడై 200 రూపాయల వార్షిక గ్రాంటును బోసు పరిశోధనల కోసం అందజేశాడు. భౌతిక శాస్త్రంలో పరిశోధనలు ప్రారంభించిన తరువాత బోసు దృష్టి వృక్ష శాస్త్రం వైపు మళ్లింది. విదేశాలలో మొక్కలపై ఆయన చేసిన వివిధ ప్రయోగాలు చూసి పలువురు ఆయనని 'వృక్షశాస్త్ర మాంత్రికు'నిగా ప్రశంసించేవారు. మొక్కలపై పరిశోధనలు చేయడానికి బోసు రూపొందించిన క్రెస్కోగ్రాఫ్, రెసోనెంట్ రికార్డర్, ఆసిలేటింగ్‌రికార్డర్ వంటి పరికరాలు చూసి విదేశీ శాస్త్రవేత్తలు, మేధావులు మంత్రముగ్ధులయ్యారు.