సెటైర్: ఆ విషయంలో చంద్రబాబుని మించిన రఘురామ..?
ఇక అధికారంలో ఉన్నప్పుడు చంద్రబాబు మీడియా కవరేజ్ మామూలుగా ఉండదు. చంద్రబాబు సీఎంగా ఉంటే.. తరచూ మీడియాలో కనిపిస్తుంటారు. తరచూ ప్రెస్ మీట్లు పెడుతుంటారు. ప్రభుత్వ కార్యకలాపాలతో పార్టీ వ్యవహారాలపైనా తరచూ ప్రెస్ మీట్లు పెడతారు. అది కూడా గంటల తరబడి ప్రెస్ మీట్లు పెట్టి విలేఖరుల సహనాన్ని పరీక్షిస్తుంటారు. అయితే.. విపక్షంలో ఉన్నప్పుడు కాస్త చంద్రబాబు జోరు తగ్గిస్తారు.
ఇప్పుడు అధికార పక్షంలో విపక్షంగా మారిన వైసీపీ ఎంపీ రఘురామ కృష్ణంరాజు... ప్రెస్ మీట్ల విషయంలో చంద్రబాబును మించి పోయారు. విచిత్రం ఏంటంటే.. ఆయన అధికార పక్షంలో ఉండి... ప్రభుత్వాన్ని విమర్శించేందుకు తరచూ ప్రెస్ మీట్లు పెడుతుంటారు. ఆ ప్రెస్ మీట్లు కూడా మామూలుగా ఉండవు.. కొంతకాలంగా చూస్తే.. ఎంపీ రఘురామ కృష్ణంరాజు కనీసం రెండు రోజులకోసారి ప్రెస్ మీట్ నిర్వహిస్తున్నారు.
ప్రెస్ మీట్‌కు వస్తే.. ఏదో రెండు విమర్శలు చేశామా.. వెళ్లామా అన్నట్టుగా ఉండదు మన ఎంపీ రఘురామ కృష్ణంరాజు ధోరణి. రోజూ రెండు ముూడు అంశాలను ఎంచుకుని.. వాటికి సంబంధించిన డేటా రెడీ చేసుకుని.. ఆ విషయంపై కసరత్తు చేసుకుని మరీ ప్రెస్ మీట్లు పెడుతుంటారు. అసలు చంద్రబాబే కాదు.. ఈ మధ్య కాలంలో రఘురామ కృష్ణంరాజు పెట్టినన్ని ప్రెస్ మీట్లు బహుశా.. ఏ రాజకీయ నాయకుడూ పెట్టి ఉండడేమో... అలా ఆ విషయంలో ఎంపీ రఘురామ కృష్ణంరాజు.. సరికొత్త రికార్డు సృష్టిస్తున్నారని చెప్పొచ్చు. ఈ జోరు ఇంకెన్నాళ్లో..?