లాజిక్ మిస్‌: ఒమిక్రాన్ రాత్రి పూటే బాగా వ్యాపిస్తుందా..?

Chakravarthi Kalyan

కరోనాలోని కొత్త వేరియంట్ ఒమిక్రాన్‌ ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా బాగా వ్యాపిస్తోంది. ఇది డెల్టా వేరియంట్ కంటే దాదాపు 6 రెట్లు ఎక్కువగా వ్యాపిస్తుందని ఇప్పటికే అనేక నివేదికలు హెచ్చరించాయి. అందుకే ప్రపంచం అంతా ఈ కరోనా వేరియంట్ పట్ల అప్రమత్తం అవుతోంది. అయితే.. ఇండియాలోనూ ఈ ఒమిక్రాన్‌ కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. ఇప్పటికే దాదాపు 400కు పైగా కరోనా కేసులు నమోదయ్యాయి. ఈ ఒమిక్రాన్ నేపథ్యంలో అనేక రాష్ట్రాలు ముందస్తుగా జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నాయి.

అయితే.. ఈ జాగ్రత్త చర్యల్లో భాగంగా అనేక రా‌ష్ట్రాలు నైట్ కర్ఫ్యూ విధిస్తున్నాయి. అయితే ఈ నైట్ కర్ఫ్యూ అనే నిబంధన వల్ల ఏమాత్రం ఉపయోగం ఉండదని గతంలో లాక్ డౌన్ల సమయంలో తెలిసొచ్చింది. నైట్ కర్ఫ్యూ అంటే రాత్రి పది గంటల నుంచి ఉదయం ఐదు గంటల వరకూ నిబంధనలు అమల్లో ఉంటాయి. ఈ సమయంలో అసలు జనం బయటకు రావడమే తక్కువ. ఈ నిబంధనతో రాత్రి ప్రయాణాలకు ఆటంకం ఏర్పడుతుంది. అసలు పట్టపగలు విచ్చలవిడిగా తిరగడాన్ని అనుమతించి నైట్ కర్ఫ్యూ అమలు చేస్తే కరోనా ఎలా తగ్గుతుందని నిపుణులు ప్రశ్నిస్తున్నారు.

ప్రముఖ పాత్రికేయుడు, ప్రొఫెసర్ కె. నాగేశ్వర్ ఈ విషయంపై సెటైర్ పేల్చారు. అనేక రాష్ట్రాలు ఒమిక్రాన్ నేపథ్యంలో నైట్ కర్ఫ్యూ విధిస్తున్నారని.. అసలు ఈ ఒమిక్రాన్ అనేది రాత్రి మాత్రమే వ్యాపిస్తుందని నివేదిక ఏమైనా వచ్చిందా అని ఆయన వ్యంగ్యంగా ప్రశ్నిస్తూ సోషల్ మీడియాలో ఓ పోస్టు పెట్టారు. ఒమిక్రాన్ రాత్రి మాత్రమే వ్యాపిస్తుందా.. పగలంతా ప్రజలను విచ్చలవిడిగా వదిలేసి.. కేవలం రాత్రి కర్ఫ్యూలు పెట్టడం కేవలం కామన్‌సెన్స్ లేకపోవడమే అని ఆయన సున్నితంగా విమర్శించారు.

 
కరోనా సమయంలో ప్రజావిధానాలు రూపొందించడంలో కాస్త బుర్ర వాడండి అన్నట్టుగా ఆన ప్రభుత్వాలకు చురకలు అంటించారు. అదీ నిజమే కదా. ఆ నైట్ కర్ఫ్యూ విధించే బదులు పట్టపగలు కాస్త కరోనా నిబంధనలు కఠినంగా అమలు చేస్తే మంచిది. ఏమంటారు..?

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: