'మా'పోరు: అసెంబ్లీ ఎలక్షన్స్‌ను మించిపోతున్నాయిగా..?

Chakravarthi Kalyan
ఎన్నికలు అనగానే అభ్యర్థుల మధ్య సవాళ్లు, ప్రతి సవాళ్లు సాధారణమే.. ఇప్పుడు మా ఎన్నికల్లోనూ అదే జరుగుతోంది. అయితే మా ఎన్నికలు అంటే.. ఓ సంఘానికి సంబంధించిన ఎన్నికలు మాత్రమే.. అందులో సభ్యుల సంఖ్య వెయ్యి కూడా దాటదు. అందులోనూ ఓటేసేవారు 500 మించి ఉండరు.. దాని పదవీకాలం కూడా రెండేళ్లు మాత్రమే.. మా బడ్జెట్ కూడా పరిమితమే. అయితే ఇప్పుడు ఈ చిన్న ఎన్నికల అంశం అసెంబ్లీ ఎన్నికలను గుర్తు చేస్తోంది.

ప్రత్యేకించి ప్రకాశ్‌ రాజ్, విష్ణు ప్యానెళ్ల మధ్య తాజాగా జరుగుతున్న మాటల యుద్ధం చూస్తుంటే.. సాధారణ ఎన్నికలు కూడా ఇంతగా జరగవేమో అన్న విమర్శలు వస్తున్నాయి. ఓ చిన్న సంఘం ఎన్నికల్లో ఎన్నో రాజకీయాలు, వ్యూహాలు సాగుతున్నాయి. చివరకు ఇందులోకి ప్రభుత్వాలను సైతం లాగుతున్నారు. మరోవైపు గెలుపు కోసం అడ్డమైన విమర్శలు చేసేందుకు కూడా ఎవరూ వెనుకాడటం లేదు. పాత విషయాలు, వివాదాలు అన్నీ ఇప్పుడు వెలుగులోకి తెస్తున్నారు. అంతే కాదు. చివరకు ఆర్ఎస్‌ఎస్‌, హిందూత్వం వంటి అంశాలు కూడా మా ఎన్నికల్లోకి వచ్చేశాయంటే.. ఇవి ఎంత ఇగో యుద్ధానికి దారి తీస్తున్నాయో ఊహించుకోవచ్చు.

అగ్నికి ఆజ్యం తోడైనట్టు మీడియా కూడా ఈ ఎన్నికలకు అవసరానికి మించిన ప్రాధాన్యం ఇస్తోందన్న వాదనలు వినిపిస్తున్నాయి. సాధారణంగా సెలబ్రెటీల అంశాలకు మీడియాలో ఎప్పుడూ ప్రాధాన్యం దక్కుతుంది. పాఠకులు కూడా ఈ అంశాలు చూసేందుకు, చదివేందుకు ఆసక్తి చూపుతారు. దీనికి తోడు ఇప్పుడు ఈ ఎన్నికల్లో సవాళ్లు.. మగతనం ఉంటే.. చూసుకుందాంరా.. దమ్ముందా.. వంటి డైలాగులు వినిపిస్తుండటంతో మీడియా..ప్రత్యేకించి ఎలక్ట్రానిక్ మీడియా ఈ వార్తలకు, లైవ్‌లకు ప్రాధాన్యం ఇస్తోంది.

దీనికి తోడు ఇప్పుడు మా ఎన్నికల్లో బ్యాలెట్టా.. ఈవీఎమ్మా అన్న వివాదం కూడా కొత్తగా వచ్చేసింది.. సో.. మొత్తం మీద.. మా రాజకీయాలు రసకందాయంలో పడ్డాయి. ఏడుపులు, పెడబొబ్బలు, సవాళ్లు, ప్రతిసవాళ్లు, విమర్శలు, ప్రతివిమర్శలు.. ఇలా మా ఎన్నికలు అసెంబ్లీ ఎన్నికలను తలపిస్తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

maa

సంబంధిత వార్తలు: