హెరాల్డ్ సెటైర్ : నిజం.. చంద్రబాబు చాలా అమాయకుడట

Vijaya
‘రాజకీయ కక్షసాధింపులంటే ఇపుడే చూస్తున్నా...ప్రత్యర్ధులపై రాజద్రోహం కేసులు పెట్టవచ్చని ఇపుడే తెలిసింది...నేను కూడా జగన్మోహన్ రెడ్డి మాదిరే ఆలోచించుంటే అప్పట్లో ఎన్ని కేసులు పెట్టుండేవాళ్ళమో’..ఇవన్నీ తాజాగా చంద్రబాబునాయుడు చెప్పిన మాటలు. ‘ప్రజాస్వామ్యం-భావ వ్యక్తీకరణ స్వేచ్చ’ అనే అంశంపై జరిగిన వీడియో సమావేశంలో చంద్రబాబునాయుడుతో పాటు  ప్రతిపక్షాల నేతలు కూడా పాల్గొన్నారు. ఈ సమావేశంలో చంద్రబాబు మాట్లాడుతు కక్షసాధింపులంటే ఎలా ఉంటుందో అనే విషయాన్ని ఇపుడే చూస్తున్నట్లు చెప్పారు. అలాగే ప్రత్యర్ధులపై రాజద్రోహం కేసులు పెట్టవచ్చని తనకింతవరకు తెలీనే తెలీదన్నారు. అధికారంలోకి వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి పెడుతున్న కేసులను చూసిన తర్వాతే తనకు అన్నీ తెలుస్తున్నాయట. వైసీపీ తిరుగుబాటు ఎంపి రఘురామ కృష్ణంరాజు అరెస్టు నేపధ్యంలో జరిగిన సమావేశంలో ప్రతిపక్ష నేతలు సమావేశమయ్యారు.



ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే తాను శుద్ధపూసనని చెప్పుకోవటానికి చంద్రబాబు తెగ ప్రయత్నిస్తున్నారు. ప్రత్యర్ధులపై ఎన్నిరకాల కేసులు పెట్టవచ్చో అన్నింటినీ  చంద్రబాబు పెట్టించారు. ముస్లిం ఓట్లకోసం గుంటూరులో నారా హమారా అనే సమావేశం జరిగింది. ఆ సమావేశంలో చంద్రబాబు మాట్లాడుతున్నపుడు 2014 ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చమని డిమాండ్ చేసిన పాపానికి  కొందరు ముస్లిం యువకులపై రాజద్రోహం కేసులు పెట్టారు. మూడు రోజులు పోలీస్టేషన్ల చుట్టు తిప్పి వాళ్ళని చావగొట్టారు. ఇంకా చాలామందిపైనే చంద్రబాబు హయాంలో పోలీసులు రాజద్రోహం కేసులు పెట్టారు. ఆ విషయాన్ని పక్కన పెట్టేస్తే చెవిరెడ్డి భాస్కరరెడ్డి, గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి లాంటి అనేకమంది ఎంఎల్ఏలపైన చాలా కేసులే పెట్టారు. మరో ఎంఎల్ఏ రోజాను విజయవాడ ఎయిర్ పోర్టులో అదుపులోకి తీసుకుని ఊర్లన్నీతిప్పి చివరకు హైదరాబాద్ లో వదిలిపెట్టిన విషయం అందరికీ తెలిసిందే. మరి దీన్నేమంటారో చంద్రబాబే చెప్పాలి.



ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే తాను అధికారంలో ఉండగా రాష్ట్రంలో అసలు ప్రతిపక్షాలే అవసరం లేదని చెప్పిన వ్యక్తి చంద్రబాబు. అధికారంలో ఉండగా ఆకాశమేహద్దుగా ఏకపక్షంగా చంద్రబాబు ఎలా చెలరేగిపోయారో అందరు చూసిందే. చివరకు వైసీపీ తరపున గెలిచిన ఎంఎల్ఏలు, ఎంపిలను కూడా ప్రలోభాలకు గురిచేసి లాగేసుకున్నారు. అలాంటిది 2019 ఎన్నికల్లో గ్రహస్ధితి తిరగబడి చంద్రబాబు ప్రతిపక్షంలో కూర్చోవాల్సొచ్చింది. ఎప్పుడైతే ప్రతిపక్షంలోకి వచ్చారో వెంటనే చంద్రబాబుకు ప్రజాస్వామ్యం, ప్రతిపక్షాల పాత్ర, పాలనలో పాదర్శకత, చట్టం, న్యాయం, వ్యవస్ధల బలోపేతం, మీడియా స్వేచ్చ లాంటవన్నీ ఒక్కసారిగా గుర్తుకొచ్చేశాయి. అధికారంలో ఉన్నపుడు తాను పట్టించుకోని వాటిని ఇపుడు జగన్మోహన్ రెడ్డి పాటించటం లేదని చంద్రబాబు గోల గోల చేస్తున్నారు.  ఇక్కడే ఆయనెంత శుద్ధపూసో అర్ధమైపోతోంది.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: