హెరాల్డ్ సెటైర్ : పాపం.. పవన్ నోరెత్తలేకపోతున్నారా ?

Vijaya
ప్రత్యక్షంగా రాజకీయాల్లోకి దిగటమంటే ఏదో సినిమాలో డైలాగులు చెప్పినట్లే అనుకున్నట్లున్నారు. అందుకనే జనసేన పార్టీని ఏర్పాటు చేశారు. పార్టీనైతే ఏర్పాటు చేశారు కాని దాన్ని ఎలా నడపాలో అర్ధం కావటంలేదు. దాంతో సినిమాలో వేసే వేషాలన్నీ నిజజీవితంలో కూడా మొదలుపెట్టేశారు. అందుకనే జనాల్లో విశ్వసనీయత కోల్పోయి చివరకు వీడియో సందేశాలకు మాత్రమే పరిమితమయ్యారు. విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ విషయంలో కేంద్రప్రభుత్వం తాజా వైఖరి చూసిన తర్వాత కూడా పవన్ కల్యాన్ నోరెత్త లేకపోతున్నారు. విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ కేంద్రప్రభుత్వ సంస్ధన్న విషయం అందరికీ తెలుసు. తన సంస్ధను ప్రైవేటీకరించింది కేంద్రమైతే తప్పంతా జగన్మోహన్ రెడ్డిదే అన్నట్లుగా పవన్ బురద చల్లేస్తున్నారు.



ఉక్కు ప్రైవేటీకరణలో నిలదీయాల్సింది కేంద్రప్రభుత్వాన్ని, నిర్ణయం తీసుకున్న నరేంద్రమోడిని అయితే ఆరోపణలు చేస్తున్నది జగన్ పైన. మోడీని నిలదీయటానికి పవన్ భయపడుతున్న విషయం స్పష్టమైపోయింది. ఇంతోటిదానికి బీజేపీకి మిత్రపక్షమనే ట్యాగ్ కూడా తగిలించుకున్నారు. అయినా కేంద్రప్రభుత్వంలోని పెద్దలను కలిసి ఉక్కు ప్రైవేటీకరణను ఆపలేకపోతున్నారు. ఎంతసేపు పార్లమెంటులో వైసీపీ ఎంపిలు కేంద్రాన్ని నిలదీయటం లేదు ? ఢిల్లీలో గోల చేయాల్సిన ఎంపిలు విశాఖ వీధుల్లో ఆందోళనలు చేయటమేంటని ప్రశ్నిస్తున్నారు. అధికారపార్టీని ప్రశ్నించటంలో తప్పేలేదు. కానీ తన వంతుగా తాను ఏమి చేస్తున్నారన్నది కూడా అవసరమే కదా. మొన్నటి ఎన్నికల్లో గాజువాక నుండి పోటీచేసిన విషయాన్ని కూడా పవన్ మరచిపోయినట్లున్నారు. స్టీల్ ఫ్యాక్టరీ ఉద్యోగులు, కార్మికులు ఎక్కువగా గాజువాక నుండే వస్తారట.



ఇప్పటికైనా పవన్ వీడియా సందేశాలు, ట్విటర్లో పోస్టులకు ఫులిస్టాప్ పెట్టి ప్రత్యక్ష కార్యాచరణకు దిగాలి. తనపైన ఉన్న కేసులకు జగన్ భయపడే కేంద్రాన్ని నిలదీయలేక పోతున్నట్లు చెబుతున్న పవన్ మరి తానెందుకు నిలదీయలేకపోతున్నట్లు ? ఇలాంటి చేష్టల వల్లే పవన్ జనాల్లో నమ్మకాన్ని కోల్పోయారు. రాష్ట్ర ప్రయోజనాలను కాపాడాలంటే  రాజకీయాపార్టీలన్నీ ఏకతాటిపైకి రావాల్సిన అవసరం ఉంది. అందుకనే పవన్ ముందుకొచ్చి అందుకు తగిన వేదికను ఏర్పాటు చేయాలి. పవన్ వేదికకు సహకరించకపోతే అప్పుడు సహకరించని వాళ్ళనే జనాలు తప్పుపడతారు. అంతేకానీ ఊరికే వాళ్ళని వీళ్ళని తప్పుపడుతు సందేశాలివ్వటంతోనే సరిపెట్టడం వల్ల ఉపయోగం లేదని పవన్ తెలుసుకోవాలి.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: