హెరాల్డ్ సెటైర్ : పవన్ గోల్డెన్ ఛాన్స్ మిస్సయాడా ?

Vijaya
అలాగే ఉంది జనసేన అధినేత పవన్ కల్యాణ్ వ్యవహారం చూస్తుంటే.  తెలంగాణాలోని దుబ్బాక ఉపఎన్నికల్లో బీజేపీ అభ్యర్ధి రఘునందనరావు గెలిచిన విషయం అందరికీ తెలిసిందే. దుబ్బాకలో టీఆర్ఎస్ అభ్యర్ధిని బీజేపీ ఓడించటమే ఇపుడు హాట్ టాపిక్. ఇంతటి చరిత్ర సృష్టించే ముందు పాపం బీజేపీకి కూడా తెలీదు తమ అభ్యర్ధి గెలవబోతున్నట్లు. ఎందుకంటే దుబ్బాకలో టీఆర్ఎస్ అభ్యర్ధిని ఓడించేంత సీన్ బీజేపీకి లేదని కమలం నేతలతో పాటు అందరికీ తెలుసు. కానీ కొన్నిసార్లు మనం ఊహించనివి జరుగుతుంటాయి. దాన్ని అదృష్టం అనండి, కొండకు వెంట్రుక కట్టడం అనండి ఏదన్నా కానీండి ఇపుడు దుబ్బాక ఫలితం గురించే అందరు మాట్లాడుకుంటున్నారు. మరో వారం రోజులు కూడా ఇదే విషయాన్ని రాజకీయ నేతలే కాకుండా మామూలు జనాలు కూడా చర్చించుకుంటారు. అయితే ఇంతమందికి హాట్ టాపిక్  అయిన దుబ్బాక ఉపఎన్నిక ఫలితం ఒక్క పవన్ కు మాత్రం చేదుమాత్రగా మిగిలిపోయింది.



ఇంతకీ విషయం ఏమిటంటే దుబ్బాక ఉపఎన్నికలో బీజేపీ అభ్యర్ధిగా రఘునందనరావు నామినేషన్ వేయాలని డిసైడ్ అయ్యింది. అప్పటి నుండి బీజేపీ నేతలు పవన్ను ప్రచారానికి రమ్మని కబురు పెడుతునే ఉన్నారు. అయితే పవన్ మాత్రం మొత్తం ఎన్నికల ప్రచారంలో ఎక్కడా మొహమాటానికి కూడా కనబడలేదు.  ఎందుకంటే తెలంగాణాలో జరుగుతున్న ఎన్నిక కదా. బీజేపీకి మద్దతుగా ప్రచారానికి దిగితే టార్గెట్ చేయాల్సింది కేసీయార్, టీఆర్ఎస్ నే. మరి కేసీయార్ అంటే ఏపిలో జగన్మోహన్ రెడ్డి మాదిరి కాదు కదా. తనకు వ్యతిరేకంగా పవన్ ఏమైనా ఆరోపణలు చేసినా విమర్శలు చేసినా తోలు తీసేస్తాడు. ప్రత్యర్ధులపై కేసీయార్ ఎలా విరుచుకుపడతారో అందరు చూస్తున్నదే. అలాగే తనకు వ్యతిరేకంగా ఉన్న మీడియా కొమ్ములు వంచి నేలలోకి దింపేయటంలో కూడా కేసీయారే మొనగాడనిపించుకున్నారు.



అలాంటి కేసీయార్ తో పెట్టుకోవటానికి పవన్ ఏమన్నా పిచ్చోడా ? అందుకనే కనీసం ఉపఎన్నికల వైపు కనీసం కన్నెత్తి కూడా చూడలేదు. ఉపఎన్నికల్లో ప్రచారానికి రాకపోవటానికి ఇంకో ముఖ్య కారణం కూడా ఉంది.  అదేమిటంటే ఎవరెంత తల్లక్రిందులుగా తపస్సు చేసినా బీజేపీ గెలిచేది లేదని. ఈమాత్రం దానికి తానెందుకు ఆయాసపడి టీఆర్ఎస్ ను తిట్టి వాళ్ళతో తిట్టించుకుని కేసీయార్ కు చెడ్డవల్లాన్నది మెయిన్ పాయింట్. అయితే ముందే చెప్పుకున్నట్లు అన్నీసార్లు మనం అనుకున్నట్లే జరగదు కదా. అందుకనే 20-20 మ్యాచ్ లో సూపర్ ఓవర్ ను మించిపోయింది ఫలితం వచ్చేసమయానికి టెన్షన్. ఎవరు ఊహించని విధంగా బీజేపీ అభ్యర్ధి గెలిచి కూర్చున్నాడు. వచ్చిన ఫలితం చూసిన తర్వాత చాలామంది లాగే పవన్ కూడా ముందు షాక్ తినుంటాడు.



గెలుపు సంబరాల్లో తెలంగాణా బీజేపీ నేతలు పండగ చేసుకుంటుంటే పవన్ మాత్రం నిర్వేదంగా చూస్తు ఉండటం మినహా మరేమీ చేయలేకపోతున్నారు. ఎందుకంటే ఎన్నిసార్లు పిలిచినా ప్రచారానికి రాలేదు కాబట్టి ఇపుడు సంబరాల్లో పాల్గొనే అవకాశం లేదు. అదే కనీసం ఒక్కసారైనా ప్రచారంలో పాల్గొన్నా లేకపోతే బహిరంగ సభలో ప్రసంగించున్నా బీజేపీ గెలుపులో తన పాత్ర కూడా ఉందని చెప్పుకునే అవకాశం ఉండేది. కానీ ఇపుడు ఆ అవకాశం లేకుండా పోయింది. జనసేనతో సంబంధం లేకుండానే బీజేపీ అభ్యర్ధి గెలవటంతో  ఎక్కడా సక్సెస్ ను క్లైం చేసుకునే అవకాశం లేదు. దాంతో పవన్ గోల్డెన్ ఛాన్స్ పోగొట్టుకున్నాడనే బీజేపీలో చర్చ జరుగుతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: