ఆస్ట్రేలియా ఘోర ఓటమి... రోహిత్ కెప్టెన్సీలో భారీ విజయం !

VAMSI
బోర్డర్ గవాస్కర్ ట్రోపీలో మొదటి టెస్ట్ ను ఇండియా గెలుచుకుని నాలుగు టెస్ట్ ల సిరీస్ లో ఆధిక్యాన్ని అందుకుంది. ఆస్ట్రేలియా లాంటి మేటి జట్టు ఇన్నింగ్స్ తేడాతో ఓడిపోవడం ఆ దేశ అభిమానులకు మరియు జట్టు యాజమాన్యానికి మింగుడుపడడం లేదు. ఉపఖండంలో టెస్ట్ మ్యాచ్ ను గెలుచుకోవడం ఇతర దేశాల జట్లకు అంత ఈజీ కాదు. మరోసారి ఈ విషయం రుజువైంది... ఇండియా స్పిన్నర్ల ధాటికి తట్టుకోలేక మూడవ రోజే టెస్ట్ మ్యాచ్ ను ముగించారు ఆస్ట్రేలియా ఆటగాళ్లు. ఆస్ట్రేలియా మొదటి ఇన్నింగ్స్ లో కేవలం 177 పరుగులకే ఆల్ అవుట్ అయింది. అందులో జడేజా ఫైఫర్ సాధించాడు. ఇండియా మొదటి ఇన్నింగ్స్ లో సరిగ్గా 400 పరుగులు చేసి 223 పరుగుల ఆధిక్యాన్ని అందుకుంది.
ఇందులో రోహిత్ 120 పరుగులు, అక్షర్ పటేల్ 84 పరుగులు మరియు జడేజా 70 పరుగులు చేశారు. ఇక ఆస్ట్రేలియా బౌలర్లలో మొదటి మ్యాచ్ ను ఆడుతున్న మర్ఫీ 7 వికెట్లతో మెరిశాడు. ఆ తర్వాత 223 పరుగుల లోటుతో రెండవ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసిన కంగారూలకు ఏ దశలోనూ కోలుకునే అవకాశం మన స్పిన్నర్లు ఇవ్వలేదు. ఒకరివెనుక ఒకరు అలా ఆస్ట్రేలియా ఆటగాళ్లు పెవిలియన్ కు చేరుకున్నారు. ఖవాజా (5) , వార్నర్ (10) , లు మరోసారి ఫెయిల్ కాగా, లాబుచెన్ (17) తక్కువ స్కోర్ కే వెనుతిరిగాడు. రెన్సా (2) , హ్యాండ్స్ కాంబ్ (6), క్యారీ (10), కమిన్స్ (1) , మర్ఫి (2), లయన్ (8), బొలాండ్ (0) లు ఘోరంగా ఆడి ఓటమిని కొనితెచ్చుకున్నారు.
కేవలం స్టీవెన్ స్మిత్ ఒక్కడే 25 పరుగులు చేసి నాట్ అవుట్ గా ఉన్నాడు. ఆస్ట్రేలియా తమ సెకండ్ ఇన్నింగ్స్ లో కేవలం పరుగులకే ఆల్ అవుట్ అయ్యి ఇన్నింగ్స్ 123 పరుగుల భారీ తేడాతో ఓడిపోయింది. సెకండ్ ఇన్నింగ్స్ లో అశ్విన్ అయిదు వికెట్లు తీసుకోవడం విశేషం. జడేజా 2 వికెట్లు, షమీ 2 వికెట్లు మరియు అక్షర్ పటేల్ 1 తీసుకుని ఆస్ట్రేలియా ఓటమిని శాసించారు. స్టీవెన్ స్మిత్ ఒక్కడే ఒంటరి పోరాటం చేసినా జట్టును ఘోర ఓటమి నుండి తప్పించలేకపోయాడు. రోహిత్ శర్మ కు టెస్ట్ కెప్టెన్ గా ఇది భారీ విజయం అని చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: