వరల్డ్ కప్ కొట్టిన తర్వాత ఇంగ్లాండ్ కు వరుస ఓటములు ?

VAMSI
గత వారమే టీ 20 వరల్డ్ కప్ 2022 ముగిసిన సంగతి తెల్సిందే. ఈ టోర్నీలో మంచి ప్రదర్శన చేసిన ఇంగ్లాండ్ జట్టు టైటిల్ ను గెలుచుకుంది. ఫైనల్ లో పాకిస్తాన్ ను ఓడించి సగర్వంగా ట్రోఫీని ముద్దాడింది బట్లర్ నేతృత్వంలోని ఇంగ్లాండ్ జట్టు. అది కాస్తా ముగిసిన వెంటనే ఆస్ట్రేలియా తో మూడు వన్ డే ల సిరీస్ ను స్టార్ట్ చేసింది. మొదటి వన్ డే రెండు రోజుల క్రితం అడిలైడ్ వేదికగా జరిగిన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్ లో ఆస్ట్రేలియా 6 వికెట్ల తేడాతో ఇంగ్లాండ్ ను ఓడించి సిరీస్ లో ముందంజ వేసింది. ఈ మ్యాచ్ లో ఇంగ్లాండ్ ఆటగాడు డేవిడ్ మలన్ భారీ సెంచరీ సాధించినా విజయం మాత్రం ఆస్ట్రేలియా నే వరించింది.
స్టీవ్ స్మిత్ అజేయ (80) అర్ధ సెంచరీ చేసి ఫామ్ లోకి రావడం విశేషం. ఓపెనర్లు వార్నర్ (86) మరియు హెడ్ (69) లు కూడా జట్టు విజయంలో పలు పంచుకున్నారు. కాగా ఈ రోజు కాసేపటి క్రితమే సిడ్నీ వేదికగా జరిగిన రెండవ వన్ డే పూర్తి అయింది. మొదటి మ్యాచ్ లో ఓడిన ఇంగ్లాండ్ ఈ మ్యాచ్ లో అయినా గెలిచి సిరీస్ ను సమం చేస్తుంది అనుకుంటే మళ్ళీ చెత్త ఆటతో సిరీస్ ను ఆతిధ్య ఆస్ట్రేలియా కు అప్పగించింది. మొదట టాస్ గెలిచిన ఆస్ట్రేలియా బ్యాటింగ్ ఎంచుకుంది. మరోసారి స్టీవ్ స్మిత్ (94) చెలరేగి ఆడడంతో జట్టు స్కోర్ 280 పరుగులు అయింది. ఈ స్కోర్ లో లాబుచెన్ (58) మరియు మార్ష్ (50) లు విలువైన పరుగులు చేశారు.
పరుగుల లక్ష్యం తో ఛేదన స్టార్ట్ చేసిన ఇంగ్లాండ్ కు మొదటి ఓవర్ లోనే మిచెల్ స్టార్క్ రాయ్ మరియు మలన్ లను డక్ అవుట్ చేశాడు. ఆ తర్వాత సాల్ట్ , బిల్లింగ్స్ మరియు విన్స్ లు ఆదుకునే ప్రయత్నం చేసినా జంపా (4/45) స్పిన్ వలలో ఇంగ్లాండ్ చిక్కుకుంది. అలా కేవలం 208 పరుగులకే కుప్ప్పకూలి 72 పరుగుల తేడాతో ఓటమి చెందింది.  ఢీనితో మరో మ్యాచ్ మిగిలి ఉండగానే సిరీస్ చేజారిపోయింది. నామమాత్రం అయిన చివరి వన్ డే ఇంకా రెండు రోజుల తర్వాత మెల్బోర్న్ లో జరగనుంది. వరల్డ్ కప్ లో మంచి ప్రదర్శన చేసిన ఇంగ్లాండ్ ఇప్పుడు వన్ డే సిరీస్ లో ఎందుకు ఇంతలా తడబడుతోంది అన్నది అర్ధం కావడం లేదు. మరి చూద్దాం మూడవ వన్ డే లో అయినా గెలిచి పరువును దక్కించుకుంటారా లేదా ?

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: