ఐపీఎల్ 2022: మారని హైద్రాబాద్... కెప్టెన్ కేన్ విలియమ్సన్ ఫెయిల్యూర్ ?

VAMSI
ఐపీఎల్ సీజన్ 15 లో మొదటి సారి చేజింగ్ చేసిన జట్టు అపజయం మూటగట్టుకుంది. మార్చ్ 26 నుండి ప్రారంభం అయిన ఐపిఎల్ 15 సీజన్ లో గత రాత్రి వరకు 5 మ్యాచ్ లు పూర్తి అయ్యాయి. అయితే నిన్న మ్యాచ్ మినహయిస్తే మిగిలిన మ్యాచ్ లు అన్నీ కూడా చేజింగ్ చేసిన జట్లే విజయమని సాధించాయి. వాస్తవానికి నిన్న కూడా చేజింగ్ జట్టే గెలవాల్సినది. కానీ ఎప్పటిలాగే సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు పేలవమైన ఆటతీరు కారణంగా భారీ ఓటమిని సొంతం చేసుకుంది. మొదట టాస్ గెలిచిన సన్ రైజర్స్ హైదరాబాద్ సారథి కేన్ విలియంసన్ బౌలింగ్ ఎంచుకున్నాడు. అయితే రాజస్థాన్ రాయల్స్ జట్టును మొదటి రెండు ఓవర్లు మినహా ఎక్కడా ఇబ్బంది పెట్టలేక పోయారు హైదరాబాద్ బౌలర్లు. దీనితో ఆకాశమే హద్దుగా చెలరేగిన రాయల్స్ నిర్ణీత ఓవర్లలో 210 పరుగుల భారీ టార్గెట్ ను సెట్ చేసింది.
రాయల్స్ ఆటగాళ్లలో శాంసన్, పడిక్కల్, హెట్ మైర్ లు రాణించారు. అయితే కెప్టెన్ కేన్ తనకున్న బౌలర్ లను సరిగా వాడుకోవడంలో విఫలం అయ్యాడని చెప్పాలి. రాయల్స్ బ్యాట్స్మన్ దూకుడుకు కళ్లెం వేయలేక ప్రేక్షకుడిలా చూస్తూ ఉండిపోయాడు. ఒక్కసారిగా ఈ లక్ష్యం చూస్తే సన్ రైజర్స్ చేధించడం కాదు కదా, కనీసం 150 చేసినా గొప్పే అనుకున్నారు అంతా, ఎందుకంటే రాయల్స్ బౌలింగ్ ఎటాక్ దుర్భేధ్యంగా  ఉంది. ఊహించిన విధంగానే సన్ రైజర్స్ బ్యాట్స్మన్ అంతా రాజస్థాన్ బౌలింగ్ దెబ్బకు తోక ముడిచారు. ఎప్పుడైనా భారీ లక్ష్యాన్ని చేదించాలంటే మొదటి నుండి వికెట్ కాపాడుకుంటూ దూకుడుగా ఆడాలి. కానీ 15 ఓవర్ ల వరకు సన్ రైజర్స్ బ్యాటింగ్ ఎలా సాగింది అంటే, వన్ డే మ్యాచ్ కన్నా దారుణంగా సాగింది.
ఓపెనర్లు విలియం సన్ మరియు అభిషేక్ శర్మ లు ఫెయిల్ అయ్యారు. తర్వాత వచ్చిన త్రిపాఠి మరియు పూరన్ లు డక్ ఔట్ గా వెనుతిరిగారు. ఆఖర్లో మార్ క్రామ్ మరియు వాషింగ్టన్ సుందర్ లు దూకుడుగా ఆడడంతో కనీసం 149 పరుగులు అయినా చేయగలిగింది. లేదంటే 100 కు లోపే పరిమితం అయి ఉండేది. ముఖ్యంగా రాజస్థాన్ బౌలర్లు ప్రసిద్ధ కృష్ణ, బౌల్ట్ మరియు చహల్ ల దాటికి విలవిలలాడిపోయింది సన్ రైజర్స్. దీనితో ఈ మ్యాచ్ లో సన్ రైజర్స్  61 పరుగుల తేడాతో ఓడిపోయి పాయింట్ల పట్టికలో ఆఖరి స్థానంలో నిలిచింది. కొత్త సీజన్ లో ఘనంగా తన వైభవాన్ని చాటుతుంది అని భావించిన అభిమానులను మరియు జట్టు యాజమాన్యాన్ని తీవ్రంగా నిరాశపరిచాడు కెప్టెన్ కేన్ విలియంసన్. కేన్ లో మునుపటి వాడి అయితే కనిపించలేదు అని చెప్పాలి. అటు ప్రత్యర్థిని పరుగులు చేయకుండా ఆపలేక, ఇటు ఓపెనర్ గా వచ్చి జట్టును ఆదుకోలేక అన్ని విధాలుగా కేన్ ఫెయిల్యూర్ అని చెప్పాలి. మరి చూద్దాం ముందు ముందు అయినా కేన్ అండ్ టీమ్ పుంజుకుంటుందా?

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: