రాముడిని వదిలేసినా, రాముడు వదిలేసినా ... మునిగిపోవటమే!

“రామ” రెండక్షరాల తారక మంత్రం. ఈ మంత్రానికి అత్యంత శక్తి సామర్థ్యాలు ఉన్నాయి. ఈ మంత్ర జపం వల్ల ‘పుట్టుక నుంచి మరణం’ వరకు జీవితం శుభప్రదంగా సాగుతుందని, అన్ని సమస్యలు సుదూరంగా వెళ్లిపోయాతాయని పురాణాల కధనం.  ఈ నామంలో ని అసలైన రాముడి కంటే, కూడా రామ నామమే గొప్పదని చాలా సందర్భాలలో మహనీయులు, ప్రవచనకర్తలు, యోగులు ప్రవచిస్తూవస్తున్నారు.

రాముడి కంటే రామ నామం ఎంతో బలమైనది, శక్తివంతమైనది, విశిష్టమైనదని భావించడం మొదలు పెట్టారు. రామ అనే మంత్రంలో "ర, అ, మ" అనే అక్షరాలున్నాయి. "ర" అంటే అగ్ని, "అ" అంటే సూర్యుడు, "మ" అంటే చంద్రుడు" అని అర్థం.  అంటే రామ అనే మంత్రంలో ఈ లోకానికి మూలమైన మూడు శక్తులున్నాయని వివరిస్తుంది. రాముడితో పుట్టిన రామ నామం రాముడి కంటే ఎందుకు గొప్పది అయింది ?

‘ఓం నమో నారాయణాయ’ అనే అష్టాక్షరి మంత్రంలోని ‘రా’ అనే ఐదవ అక్షరం ‘ఓం నశ్శివాయ’ అనే పంచాక్షరీ మంత్రంలోని ‘మ’ అనే రెండవ అక్షరం కలిస్తే ‘రామ’ అనే నామం అయింది. అంటే హరిహర తత్వాలు రెండింటిని ఇముడ్చుకున్న నామం రామ నామం! శ్రీరాముడు సీతను రావణ చెర విడిపించటానికి సమాయత్తమై లంకకు వెళ్ళటానికి సముద్రంపై “సేతువు” నిర్మాణం తలపెట్టారు. వానరులు సేతువు నిర్మాణం కోసం సముద్రంలో పెద్ద పెద్ద రాళ్లు వేస్తున్నారు. అవి సముద్ర జలాలపై తెలుతున్నాయి. ఇదంతా చూస్తూ శ్రీరాముడు కూడా కొన్ని రాళ్లు తనూ, వేద్దామని సముద్రంలో రాయిని వదిలాడు. విచిత్రంగా ఆ రాయి మునిగిపోయింది. సరే! అని మరొకటి వేశాడు. అది కూడా మునిగి పోయింది.

“ఇదేంటి! వానరులువేస్తే రాళ్ళు తేలుతున్నాయి. నేను వేస్తే మునిగి పోతున్నాయి ఎందుకు?” ఒకింత ఆశ్చర్యంతో  అయినా “చూద్దాం!” అని మరో రాయి సముద్రంలోకి విడిచాడు. అది కూడా మునిగి పోయిందట. ఇదేంటని శ్రీరాముడు హనుమను, కొందరు వానర వీరులను అడిగాడు.

 “స్వామి! మేము వేసే రాళ్ళ మీద మీ నామం రాస్తున్నాం! మీరు రాయలేదు కదా!” అన్నారు హనుమ.
“అదేంటి. నేను స్వయంగా వేస్తున్నాను కదా! నా నామం రాస్తేనే తేలితే, నేను వేస్తే రాయి మునిగి పోవటం ఏమిటి? ఎందుకలా?” కొంచెం వివశత్వంతో అన్నారు శ్రీరామచంద్ర స్వామి.
అందుకు హనుమ మందస్మిత హృదయంతో నవ్వుతూ ఇలా సమాధానం చెప్పారు. “స్వామి! మీరు ఆ రాయిని నీట విడిచి పెట్టేశారు. “రాముడి ని వదిలేసినా! రాముడు వదిలేసినా! ఏదైనా మునిగిపోక తప్పదు కదా!”అదే జరుగుతోంది స్వామి!” అని నర్మగర్భంతో చెప్పారు.

అందుకే, రామ నామాన్ని ప్రతి రోజూ ముమ్మారు రాస్తూ, పలుమార్లు జపించండి. అప్పుడే రామానుగ్రహం పరిపూర్ణంగా దొరుకుతుంది. ధర్మంగా జీవించండి.


* రావణాసుర సంహారానంతరం అయోధ్యనగరం చేరుకుని శ్రీరాముడు పట్టాభిషేకం చేసుకుని రాజ్యపాలన చేపట్టాక, అయోధ్యానగరంలో రామసభ కొలువుదీరి వున్న సమయంలో ఒక రోజు విశ్వామిత్ర మహర్షి సభకు వచ్చాడు.

మహర్షిని చూస్తూనే రాముడితో సహా సభలోని అందరూ లేచి నిలబడి మహర్షికి నమస్కరించారు. కానీ ఆంజనేయుడు రామనామ జపంలో మునిగి వుండటం వల్ల విశ్వామిత్రుడి రాకను గమనించక నిలబడలేదు, నమస్కరించలేదు. దీనిని ధిక్కారంగా భావించిన విశ్వామిత్రుడు కోపోద్రిక్తుడై “రామా! నీ సేవకుడు నన్ను అవమానించాడు. నీవు అతడిని శిక్షించు” అని రాముడిని ఆదేశించాడు.


విశ్వామిత్రుడి మాటను జవదాటలేని శ్రీరాముడు హనుమంతుడిని శిక్షించేందుకు సిద్దమయ్యాడు. ఈ విషయం తెలిసిన హనుమంతుడు నారద మహర్షి సలహా మేరకు ‘రామ’ నామాన్ని జపించడం ప్రారంభించాడు.


ఈ విషయంలోనే విశ్వామిత్రుడి ఆజ్ఞ మేరకు శ్రీరాముడు హనుమంతుడిపై బాణాల వర్షం కురిపించసాగాడు. ‘రామ’ నామ జపంలో నిమగ్నమైన ఆంజనేయుని రామబాణాలు ఏమీ చేయలేక పోయాయి. అలసి పోయిన శ్రీరాముడికి పట్టుదల అధికంకాగా చివరకు బ్రహ్మాస్త్రం ప్రయోగానికి సిద్దమయ్యాడు.


ఇంతలో నారద మహర్షి అక్కడకు చేరుకుని “మహర్షీ! హనుమంతుడు నీ రాకను రామ నామ జపం వల్ల గమనించక నమస్కరించనంత మాత్రమున మీరు మరణ దండన విధించడమా? ‘రామ’ నామ జపం హనుమంతుడిని రామ బాణాల నుంచి రక్షిస్తూ వుంది. యిప్పటికైనా మీ ఆవేశాన్ని కోపాన్ని తగ్గించుకుని ఆజ్ఞను ఉపసంహరించండి” అని విశ్వామిత్రుడితో పలికాడు.


ఈ మాటలను విని విశ్వామిత్రుడు బ్రహ్మాస్త్ర ప్రయోగాన్ని నిలుపు దల చేయించి హనుమంతుడి రామభక్తిని మెచ్చుకున్నాడు.

దీనిని బట్టి రామబాణం కంటే కూడా రామనామం గొప్పదని సృష్టమవుతూవుంది. యుగయుగాలను, సర్వలోకాలను తరింపజేసిన మహిమాన్వితమైన నామం – ‘రామనామం’.


శ్రీ రామ జయరామ జయ జయ రామ! జై శ్రీరాం!


జై శ్రీరాం! జై శ్రీరాం! జై శ్రీరాం!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: