చావగొట్టేస్తున్న చంద్రబాబు.. ఇక మారరా..?

Chakravarthi Kalyan
చంద్రబాబు ఢిల్లీ వచ్చారు. వైసీపీ సర్కారు ఏపీలో అరాచకం చేస్తోందంటూ ఢిల్లీలోని పెద్దలకు కంప్లయింట్ చేయడానికి వచ్చారు. అందులో భాగంగా రాష్ట్రపతిని కలిశారు. ఏకంగా 300 పేజీల నివేదిక ఆయనకు అందించారు.. పాపం.. ఆ పెద్దాయన దాన్ని ఎప్పుడు చదువుతాడో ఏమో.. దాదాపు అరగంట సేపు రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ తో తెలుగు దేశం బృందం భేటీ అయ్యింది. అంతవరకూ బాగానే ఉంది. కానీ.. ఆ తర్వాతే అసలు కథ మొదలైంది.

రాష్ట్రపతిని కలిసి వచ్చిన తర్వాత చంద్రబాబు ప్రెస్ మీట్ పెట్టారు. సాధారణంగా ఎవరైనా సరే.. రాష్ట్రపతిని కలిసి బయటకు వచ్చాక.. తాము రాష్ట్రపతిని ఎందుకు కలిసింది.. ఆయన ఏం చెప్పిందీ మీడియాకు చెప్పడం అలవాటే.. అయితే.. చంద్రబాబు మాత్రం ఇందుకు భిన్నంగా రొటీన్ ప్రెస్ మీట్‌ లా ఊదరగొట్టడం మొదలు పెట్టారు. రాష్ట్రపతిని దాదాపు అరగంట సేపు కలిస్తే.. బయటకు వచ్చి మీడియాకు చెప్పింది అంతకు మించి ఉంది.

చంద్రబాబు ప్రెస్ మీట్‌లో కొన్నిరోజులుగా చంద్రబాబు చెబుతున్న విషయాలే తప్ప కొత్త విషయాలు లేవు.. ఇటీవల చంద్రబాబు రాష్ట్రం స్పాన్సర్ చేస్తున్న టెర్రిరిజంపై పోరాటం పేరుతో 36 గంటల దీక్ష చేశారు. ఆ దీక్ష ప్రారంభం సమయంలో ఓ గంట.. ముగింపు సమయంలో ఓ గంటన్నర సేపు చంద్రబాబు ప్రసంగం సాగింది. తాజాగా రాష్ట్రపతిని కలిసి వచ్చిన తర్వాత మాట్లాడిన సమయంలోనూ ఈ పాత ప్రసంగాల్లో మేటర్ తప్ప కొత్త విషయం కనిపించలేదు.

దీంతో చంద్రబాబు రాష్ట్రపతి భేటీ అంశాన్ని కవర్ చేయడానికి వచ్చిన జర్నలిస్టులు తలలు పట్టుకున్నారు. ఈ పాత కథ అంతా మాకెందుకు చెబుతున్నట్టు అనేలా ఆముదం తాగిన ముఖాలు పెట్టేశారు. అయినా మన చంద్రబాబు వదలుతారా.. తాను చెప్పదలచుకున్నదంతా చెప్పి కానీ.. అక్కడి నుంచి బయలుదేరలేదు. మీడియాలో ఎంత ఎక్కువగా కనిపిస్తే.. అంత పబ్లిసిటీ వస్తుంది.. అంతగా జనంలోకి వెళ్తాం అన్న వ్యూహం చాలా పాత చింతకాయ పచ్చడి టైపు. కానీ.. ఇంకా చంద్రబాబు ఆ పాత చింతకాయ పచ్చడికే ప్రాధాన్యం ఇస్తున్నారేమో అనిపిస్తోంది.. ఇలాంటి ప్రెస్ మీట్లు చూస్తే..!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: