బాబూ.. ఆ ఫ్లాష్‌బ్యాక్ మరిచావా? : బీజేపీ కౌంటర్‌!

Chakravarthi Kalyan
ఏపీలో శాంతిభద్రతల పరిస్థితి అస్సలు బాగా లేదని ప్రతిపక్షనేత చంద్రబాబు అంటున్నారు. ఏపీలో రాష్ట్రపతి పాలన పెట్టాలని ఆయన కేంద్రాన్ని కోరుతున్నారు. ఏపీలో రాజ్యాంగ వ్యవస్థలు విచ్ఛిన్నమయ్యాయని, శాంతి భద్రతలు దిగజారాయని చంద్రబాబు వాపోతున్నారు. ఏపీలో రాష్ట్రపతి పాలన విధించడంతోపాటు జరుగుతున్న సంఘటనలపై సీబీఐతో విచారణ చేయించాలని ఆయన కోరుతున్నారు. ఈ మేరకు రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌, ప్రధాని మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్‌షాకు చంద్రబాబు లేఖలు రాశారు.

టీడీపీ కేంద్ర కార్యాలయంతోపాటు రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ కార్యాలయాలపై దాడులకు పాల్పడిన విషయాన్ని లేఖల్లో పేర్కొన్నారు. శాసన, కార్యనిర్వాహక, న్యాయ వ్యవస్థలతోపాటు రాజకీయ పార్టీలు, మీడియాపై దాడులు చేస్తున్నారని లేఖలో తెలిపారు. ఇది ప్రభుత్వ ప్రేరేపిత ఉగ్రవాదమేనని.. దాడులకు పాల్పడే వారితో పోలీసులు లాలూచీ పడుతున్నారని లేఖలో చంద్రబాబు తెలిపారు. ఏపీ నుంచే మాదకద్రవ్యాలు అక్రమ రవాణా అవుతున్నాయని గుజరాత్‌, తెలంగాణ, కర్ణాటక, ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రాల పోలీసులు ధ్రువీకరించిన విషయాన్ని లేఖలో చంద్రబాబు తెలిపారు.

ఏపీలో రాష్ట్రపతి పాలన విధించి ఆంధ్రప్రదేశ్‌లో శాంతిభద్రతలను పరిరక్షించాలని... మూకుమ్మడి దాడుల వెనక కుట్రపై సీబీఐ విచారణ చేయించాలని.. తెదేపా కార్యాలయాలు, ముఖ్య నేతల ఇళ్లకు కేంద్ర బలగాలతో రక్షణ కల్పించాలని చంద్రబాబు రాష్ట్రపతి, ప్రధాని, హోంమంత్రిలకు విజ్ఞప్తి చేశారు. అయితే.. ఇదే సమయంలో గతంలో చంద్ర బాబు కేంద్రం విషయంలో చేసిన విమర్శలను బీజేపీ నేత జీవీఎల్ నరసింహారావు గుర్తు చేశారు. గతంలో కేంద్రం ఎపిలోకి అడుగుపెట్టడానికి వీలు లేదని చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు చెప్పిన మాటలను గుర్తు చేశారు.

అలాంటి చంద్రబాబు నాయుడు ఇప్పుడు కేంద్రం జోక్యం చేసుకోవాలని అంటున్నారని నరసింహారావు కామెంట్ చేశారు. గతంలో చంద్రబాబు ఏమి మాట్లాడారో గుర్తు చేసుకోవాలని జీవీఎల్ సూచించారు. గతంలో తాను చేసిన తప్పులను ముందుగా ఒప్పుకోవాలని చంద్రబాబుకు జీవీఎల్ సూచించారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: