మంచిమాట: పశ్చాత్తాపాన్ని మించిన ప్రాయశ్చిత్తం ఉంటుందా..?

Divya
కంచిపేట లో నందయ్య, మంగమ్మ లకు చలపతి.. రఘుపతి అనే ఇద్దరు కొడుకులు ఉండేవారు. ఒకరోజు నందయ్యకు ఒంట్లో బాగోలేక పొలం పనులకు కొడుకులిద్దరిని పంపించాడు.. చలపతి కష్టజీవి.. రఘుపతి మాత్రం పని దొంగ.. కానీ తండ్రి మాటకు ఎదురు చెప్పలేక అన్నతో పాటు పొలం పనులుకి వెళ్ళాడు. అన్న చలపతి రోజంతా ఎండలో కష్టపడి పని చేస్తుంటే రఘుపతి పొలం గట్టున చల్లని నీడలో హాయిగా నిద్రపోయేవాడు.
పొద్దుగూకే వేలకి చలపతి పని ముగించి కాలువ వద్ద కాళ్లు చేతులు శుభ్రం చేసుకుంటుంటే రఘుపతి మాత్రం ఒంటి మీద అక్కడక్కడ కొంచెం బురద చల్లుకొని పాదాలకు కాస్త బురద పట్టించి ఇంటి ముఖం పట్టాడు.
వంటిపై బురదతో వచ్చిన రఘుపతి ని చూసిన తల్లి మంగమ్మ  తాను చేసిన పని గురించి అడిగింది. అందుకు రఘుపతి ఉదయం నుంచి పొలంలో పని చేశాను. చలపతి ఎక్కడెక్కడో తిరుగుతూ వెనుక వస్తున్నాడు. అని అబద్ధం చెప్పాడు. అతని కాళ్లకు ఒంటికి అంటిన బురదను చూసిన మంగమ్మ అతని మాటలు నమ్మింది. పెద్ద కొడుకు ఇంటికి వస్తూనే చివాట్లు పెట్టింది.
ఆ రాత్రి భోజనాలయ్యాక చలపతి గుర్రుపెట్టి నిద్రపోతున్నాడు. రఘుపతి మాత్రం నిద్ర పట్టకుండా అటు ఇటు దోర్ల సాగాడు.. అంతా గమనిస్తున్న నందయ్య రఘుపతి తో చిన్నోడా అన్న కష్టపడ్డాడు కాబట్టి హాయిగా నిద్రపోతున్నాడు. నువ్వు పని ఎగ్గొట్టి పగలంతా నిద్రపోయి ఉంటావు. కాబట్టి ఇప్పుడు నిద్ర పట్టడం లేదు. నువ్వు చాడీలు చెప్పినా తమ్ముడి వన్న ప్రేమతో చలపతి నీ తప్పుని ఉపేక్షించాడు అవునా? అని అడిగాడు. అందుకు రఘుపతి తను చేసిన పనికి సిగ్గుపడ్డాడు.మంగమ్మ కూడా తన తొందరపాటుకు నొచ్చుకుంది.. మర్నాడు అన్నతో సమానంగా కష్టపడి రఘుపతి తన  తల్లిదండ్రుల అభిమానానికి పాత్రుడయ్యాడు. పశ్చాత్తాపానికి మించిన ప్రాయశ్చిత్తం మరొకటి లేదు అని ఈ తమ్ముడు రఘుపతి నిరూపించాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: