మంచిమాట : తెలివి ఏ ఒక్కరి సొత్తు కాదు.!

Divya
ఒక పట్టణంలో ఒక ధనికుడు ఉన్నాడు. అతడికి వ్యాపారంలో నష్టం వచ్చి, ఆస్తి అంతా పోగొట్టుకున్నాడు. పూలు అమ్మిన చోట కట్టెలు అమ్మటం ఇష్టం లేక ఆ ఊరు వదిలి వెళ్లాలని నిర్ణయించుకున్నాడు. అతడి ఇంట్లో తాతల కాలం నాటి ఒక ఇనుప త్రాసు ఉండేది. అది చాలా గొప్పది. అటువంటి త్రాసు దొరకటం చాలా కష్టం. ఆ త్రాసును వదులుకోవడం ఇష్టం లేదు. దాన్ని తన స్నేహితుడైన ఒక వర్తకుని ఇంట్లో ఉంచి దేశదేశాలు తిరిగాడు. చాలా ధనం కూడా సంపాదించాడు.
కొన్ని సంవత్సరాల తర్వాత తిరిగి వచ్చి తన త్రాసు ను తనకు తిరిగి ఇవ్వమని ఆ వర్తకుని అడిగాడు. కానీ వర్తకుడు త్రాసును కాజేయాలని అనుకొన్నాడు. "నీ త్రాసును ఎలకలు తినేశాయి!"అని ఆ ధనికుడి తో చెప్పాడు."అలాగా! అయితే సరేలే!"అని ఆ తెలివి గల ధనికుడు అప్పటికి ఊరుకున్నాడు. కానీ ఆ వర్తకుడికి బుద్ధి చెప్పడానికి ఒక ఎత్తు వేశాడు.
ఒకరోజు ధనికుడు స్నానం చేయటానికి నదికి వెళ్తూ.. ఆ వర్తకుడి కుమారుని తనతో పాటు తీసుకొని వెళ్ళాడు. స్నానం చేసి తిరిగి వస్తూ ఆ పిల్లవాన్ని ఒక చోట దాచి పెట్టాడు. ఏడుస్తూ వర్తకుని దగ్గరకు వచ్చి .. అయ్యో  "నీ కొడుకుని గ్రద్ద తన్నుకుపోయింది"అని చెప్పాడు.
అప్పుడు ఆ వర్తకుడు" దుర్మార్గుడా! ఎక్కడైనా బాలు డిని గ్రద్ద తన్నుకు పోతుందా?"అని న్యాయాధికారి దగ్గరకు వెళ్లి ఫిర్యాదు చేశాడు. న్యాయాధికారి ఆ ధనికున్ని పిలిచి, "గ్రద్ద బాలుడిని ఎలా తన్నుకు పోగలదు?"అని అడిగాడు. ఆ మాటకు ఆ ధనికుడు ఇందులో అనుమానపడవలసింది ఏమీ లేదు. ఈ నగరంలో ఇనుప త్రాసు ను తినే ఎలుకలే ఉంటే, బాలుడిని ఎత్తుకుపోయే గ్రద్దలు ఉండవా?"అని అన్నాడు. అది విని అందరూ ఆశ్చర్యపోయారు. న్యాయాధికారి జరిగిన విషయాన్ని అడిగి తెలుసుకున్నాడు. వర్తకుడిని మందలించి అతనికి పిల్లవాణ్ణి, ధనికుడికి త్రాసు ని ఇప్పించాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: