మంచిమాట: ప్రవర్తన మార్చుకో..ప్రోత్సహించడం నేర్చుకో..

Divya

ఒక మనిషి బాగు పడుతున్నాడు అంటే అందుకు తగిన సహాయం చేయకపోయినా సరే, అతనికి ప్రోత్సాహాన్ని అందించాలి. సత్ప్రవర్తనతో మెలుగుతూ నలుగురికి సహాయపడేలాగా ఉండడమే మనిషి జీవిత ధర్మం. అందుకు కావలసిన ఒక చక్కటి ఉదాహరణను మీకు వినిపిస్తాను..అదేమిటో మీరు కూడా చూసి నేర్చుకుంటారని మా మనవి.
అనగనగా ఒక ఊరిలో ఒక కాకి, ఎద్దు ఉండేవి. కాకి పగలంతా ఆహారం కోసం తిరిగి సాయంకాలం తన గూటికి చేరుకునేది. అదే సమయానికి ఒక రైతు వద్ద ఉన్న ఎద్దు కూడా పొలం అంతా దున్ని, తిరిగి పశువులపాక చేరుకొని ,నెమ్మదిగా గడ్డి తింటూ నెమరు వేస్తూ ఉండేది. ఇక ప్రతి రోజు సాయంత్రం అయ్యే సరికి ఈ రెండూ కలిసి కష్టసుఖాలు కలబోసుకునేవి. ఎద్దు పడుతున్న కష్టాన్ని చూసి కాకి.. "మిత్రమా! నువ్వు ఎంత వెర్రి దానివి. ఆ రైతు చూడు.. నీ మెడపై కాడినుంచి పగలంతా వెట్టిచాకిరీ చేయించుకుని ,తిరిగి సాయంత్రానికి కేవలం నాలుగు గడ్డిపరకలు, కాస్త కుడితి నీ ముఖాన పడేసి ,చేతులు దులుపుకుంటున్నారు. నీవు దానికి పొంగిపోయి ఒళ్లంతా హూనం చేసుకుంటూ వెట్టిచాకిరి చేస్తూ ఉన్నావు. నీ కాలి గిట్టల ఎలా అరిగిపోయాయో చూడు.. మెడ ఒరుసుకుపోయి మచ్చలు కూడా పడింది..
అదే నేను చూడు... నచ్చిన ఆహారం , కనిపించిన దానిని  ఠక్కున ముక్కున వేసుకుని కరుచుకుపోతాను. అది ఎవరిదైనా లెక్క పెట్టను.. అందులో ఎంత  మజా ఉందో నీకేం తెలుసు. చౌర్యం అనేది ఒక కళ. అది ఎంత సంతోషం కలిగిస్తుందో నీకు తెలియదులే.. ఇకనైనా గ్రహించు.. నీ బంధాలన్నీ తెంచుకో.. పచ్చిక బయళ్ళలో గడ్డిని మేస్తూ.. హాయిగా, స్వేచ్ఛగా విహరించు" అంటూ ఉపదేశం చేసింది.
ఇక అంతా ఓర్పుగా విన్న ఎద్దు "మిత్రమా..! నీవు అనుకుంటున్నట్టు నేనేమి విచారంగా లేను. నా కష్టం తో ఒక రైతుకి , అతని కుటుంబానికి సేవ చేయడమే కాకుండా ఎంతో మంది ప్రజలకు ఆకలి తీరుస్తున్నాను  అనే సంతృప్తి చాలు . అది నాకు సంతోషాన్ని, బలాన్ని ఇస్తోంది  కాబట్టి నీ  సలహాలు నేను పాటించలేక పోతున్నాను.. అందుకు నన్ను క్షమించు".. అంటూ నెమ్మదిగా తప్పుకుంది ఎద్దు. ఇక ఆ మాటలతో కాకి కళ్ళు తెరుచుకున్నాయి. ప్రవర్తన మార్చుకోవాలని నిర్ణయించుకుంది. కాబట్టి ఇతరులకు సహాయం చేయకపోయినా పర్లేదు, ఇతరులు చేసే మంచి పనులను చెడగొట్టకుండా ఉంటే అంతే మేలు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: