మంచిమాట : మోసాన్ని మోసంతోనే జయించాలి..

Divya

అనగనగా ఒక అడవిలో ఒక చిన్న చెరువు ఉండేది.బా చెరువులో బోలెడన్ని చేపలు ఉండేవి. వాటితో పాటు ఒక మొసలి కూడా ఆ చెరువులో ఉండేది. ఇక చెరువులో వున్న మొసలి, అక్కడి చెరువులో ఉన్న చేపలను తింటూ జీవనం సాగిస్తూ ఉండేది. ఇక ఆ మొసలి అక్కడ ఉన్నదనే భయంతో అక్కడికి ఏ జంతువులు కూడా వచ్చేవి కాదు. ఆ చెరువు దగ్గర్లోనే ఒక పీత ఉండేది.అది మొసలికి మంచి మిత్రుడు. ప్రతిరోజు చేపలు తినీ తినీ మొసలికి వెగటు పుట్టింది. అందుచేత ఏదైనా ఉపాయం చెప్పి, తనకు వేరే ఆహారం ఏదైనా దొరికేటట్టు చూడమని పీతతో చెప్పింది. పీత బాగా ఆలోచించి, దానికి ఒక సలహా చెప్పింది. " నీవు వొడ్డు పైన చనిపోయినట్లు పడి ఉండు. నేను వెళ్లి అడవిలోని జంతువుల అన్నింటికీ నీవు చచ్చిపోయావు అని చెప్తాను. ఆ పైన జంతువులన్నీ  ఆ చెరువు దగ్గరికి నీళ్లు తాగడానికి వస్తాయి. ఆ తర్వాత నీ ఇష్టం వచ్చిన జంతువును పట్టుకొని తింటూ ఉండవచ్చును "అని.

ఓహో!  నీ సలహా చాలా బాగుంది అంది మొసలి. ఇక పీత వెంటనే అడవిలోకి వెళ్లి మిత్రులారా..చెరువులోని మొసలి చచ్చిపోయింది. మీరు ఇంక భయం లేకుండా వచ్చి నీళ్లు తాగవచ్చు అని చెప్పింది. ఇక దాని మాటలు అన్ని జంతువులు నమ్మాయి. కానీ వాటిలో ఒక తెలివైన నక్క మాత్రం నమ్మలేదు. అప్పుడు నక్క పీతతో నేను నీతో వస్తాను..నాకు చచ్చిన మొసలిని చూపించు అని పీత వెనకే వెళ్ళింది. నక్క మొసలి ని చూసి అది చావలేదని ఊహించుకొని, అక్కడకొచ్చిన జంతువులతో మిత్రులారా! మొసలి చచ్చిపోయిందని మీరు నమ్ముతున్నారా? అది తోక కదుపుతున్నట్లు ఉంది  మీరు ఎవరైనా గమనించారా? నాకు ఒక గుడ్లగూబ చెప్పిన ప్రకారం మొసలి చచ్చినా కూడా దాని తోక కదులుతూ ఉంటుంది అది గట్టిగా చెప్పింది.
తెలివి లేని మొసలి నక్క మాట విన్న వెంటనే తోక కదిలించడం మొదలు పెట్టింది. అది బ్రతికే ఉందని నక్కకు ఇప్పుడు అర్థమైంది. వెంటనే గట్టిగా మిత్రులారా మొసలి బ్రతికే ఉంది. అందరూ ఇక్కడి నుండి పారిపోండి అంటూ గట్టిగా అరిచింది. ఇక వెంటనే జంతువులన్నీ అక్కడినుండి పారిపోయాయి. మోసం చేయాలనుకున్న  మొసలి చివరకు నక్క చేతిలో మోసపోయింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: