మంచిమాట : పదిమందిని బాధపెట్టి పైకెదగడం కాదు, పదిమందికి తోడ్పడుతూ ఎదగాలి!
మనలో ప్రతిఒక్కరూ కెరీర్ లో పైకి ఎదగడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. ఎదిగే క్రమంలో కొందరు కష్టాన్ని నమ్ముకుంటే మరికొందరు మాత్రం అడ్డదారులు తొక్కుతూ సక్సెస్ కావాలని అనుకుంటారు. కెరీర్ లో ఎదగాలనుకోవడం తప్పు కాదు. అయితే పదిమందిని బాధపెట్టి సాధించే విజయం కంటే పదిమందికి తోడ్పడుతూ సాధించే విజయానికే విలువ ఎక్కువగా ఉంటుంది. అలా సాధించే విజయానికి మాత్రమే సరైన గుర్తింపు ఉంటుంది.
ఎల్లప్పుడూ ఇతరులకు సహాయం చేసే గుణాన్ని మనం అలవరచుకోవాలి. మన తెలివి, జ్ఞానాన్ని ఇతరులకు పంచాలి. ఈర్ష్య, అసూయలాంటి భావాలు మనకు చెడు చేస్తాయే తప్ప మంచి చేయవు. వీటికి దూరంగా ఉండి కెరీర్ లో సక్సెస్ కోసం ప్రయత్నించాలి. ఇతరుల విజయాలను చూసి మనం కూడా అదే విధంగా ఎదగడానికి ప్రయత్నించాలే తప్ప అసూయ పడరాదు. శ్రమను నమ్ముకుని సక్సెస్ కోసం ప్రయత్నిస్తే ఆలస్యంగానైనా ఉన్నత శిఖరాలకు చేరుకునే అవకాశం ఉంటుంది.
ఇతరులను బాధ పెడుతూ మనం ఎదగడానికి ప్రయత్నిస్తున్నామంటే మనలో ఏదో లోపం ఉందని గ్రహించాలి. ఈ గ్రహింపు మనిషికి చాలా అవసరం. పదిమందిని బాధ పెడుతూ మనం పైకి ఎదిగితే మన కష్టాల్లో తోడుగా ఎవరూ ఉండరు. అలా కాకుండా పదిమందికి ఎదుగుదలకు మనం సహాయసహకారాలు అందించి వాళ్లు జీవితంలో ఉన్నతస్థానాలకు ఎదగడానికి కృషి చేస్తే జీవితాంతం మనల్ని గుర్తుంచుకుంటారు.
మన వల్ల ఇతరులకు మంచి జరగాలని కోరుకునే స్వభావం ఉండాలే తప్ప చెడు జరగాలని కోరుకోకూడదు. శ్రమతో విజయం సాధించిన వాళ్లు ఎన్ని కష్టాలు వచ్చినా వాటిని తట్టుకుని నిలబడగలిగే సామర్థ్యాన్ని కలిగి ఉంటారు. మనకు ఉన్నదానిలో నీతి, నిజాయతీతో వ్యవహరిస్తూ నమ్రత, దయ, కరుణ, పరోపకారం లాంటి గుణాలను కలిగి ఉంటే కెరీర్ లోనే కాదు మనిషిగా కూడా ఉన్నతస్థానానికి ఎదగగలుగుతాం.