మంచిమాట: దురాశ దుఃఖానికి చేటు

Durga Writes

ఆశ.. మనిషిని బతికిస్తుంది. దురాశ మనిషిని చంపేస్తుంది. ప్రతి మానవుడికి ఆశ అనేది ఒకటి ఉండాలి. కానీ దురాశ అనేది ఉంటె మనిషి ప్రాణానికే ముప్పు. నీ జీవనానికి అవసరం అయ్యేంత దేవుడిని అడుగు.. నీకు ఇస్తాడు. దురాశకు పోయి నీకు కావాల్సిన దానికంటే ఎక్కువ అడిగితే నీ జీవనమే కష్టం అవుతుంది. అసలు ఆశకు దురాశకు తేడా ఏంటో తెలుసుకోండి. 

 

ఆశ.. అనేది మనిషి ప్రాణాన్ని కాపాడుతుంది. రేపు నేను ఇది సాధించాలి అనే కోరిక ఆశగా మరి దాని కోసం కష్టపడి మంచి జీవితాన్ని పొందుతారు. కానీ దురాశ అనేది ఉన్నదని కంటే ఇంకా ఇంకా ఎక్కువ కావాలి అని అనుకుంటారు. దానికోసం ఎన్నో దారుణాలు చేస్తారు. ఆ దురాశ అనేది ఉంటె మరో మనిషిని చంపడానికి కూడా వెనుకాడరు. ఆలా చంపి మళ్ళి వాళ్ళు సుఖంగా ఉన్నదీ లేదు. అందుకే అంటారు పెద్దలు దురాశ దుఃఖానికి చేటు అని. 

 

ఈ సామెతకు ఒక ఉదాహరణ.. వింధ్యారణ్యం అనే ప్రాంతంలో భైరవుడు అనే వేటగాడు ఉండేవాడు. రోజూ అడవికి వెళ్ళి, రకరకాల ఆహార పదార్థాలను సేకరించి, వాటితో తన కుటుంబాన్ని పోషించేవాడు. అడవిలో దొరికే ఆకులు, దుంపలు, కాయలు, పండ్లు, తేనె, వెదురు బియ్యం లాంటి వాటన్నింటి కంటే భైరవుడికి... కుందేలు, జింక, అడవిపంది వంటి జంతువుల మాంసమంటే చాలా ఇష్టం.

 

అయితే ఒకరోజు ఒక బలసిన జింకను వేటాడి చంపిన భైరవుడు, ఇంటిల్లిపాదీ ఆనందంగా విందు చేసుకోవచ్చునే సంతోషంలో దాన్ని భుజంపైన వేసుకొని తన ఇంటి దారి పట్టాడు. అయితే ఆ అడవి మార్గంలో అతనికి అనుకోకుండా బాగా మదించి, కోరలు ఉన్న అడవి పంది ఒకటి కనిపించింది. భైరవుడు తన భుజం మీది జింక శవాన్ని నేలపైకి దించి, తన విల్లమ్ములు తీసుకుని పదునైన బాణంతో ఆ అడవి పంది రొమ్మును గాయపరిచాడు. 

 

అసలే కోపం, మొండితనం ఎక్కువగా ఉండే అడవిపంది గాయాన్ని లెక్కచేయకుండా వేగంగా పరుగెత్తుకొచ్చి భైరవుడి పొట్టను కోరలతో చీల్చి చెండాడి, చంపివేసింది. తర్వాత గాయం బాధ ఎక్కువై అది కూడా చచ్చిపోయింది. భైరవుడు, అడవిపందిల తొక్కిసలాటలో అటుగా వచ్చిన పాము కూడా చనిపోయింది. ఇది అంత చుసిన నక్క అత్యాశకు గురై ఇలా అనుకుంది. 

 

ఈ మనిషి శవం ఒక మాసం పాటు తినొచ్చు. జింక, పంది శవాలను రెండు నెలల పాటు భోంచేయవచ్చు. ఈ పాము తలను తీసేసి ఒక రోజంతా కడుపునింపుకోవచ్చు. అంటే మూడు నెలల ఒక్క రోజు పాటు ఆహారం గురించి వెదికే పనే లేదన్నమాట. మరి ఈ పూట మాటేమిటి? ఆ! ఈ వేటగాని ధనుస్సుకు కట్టివున్న కమ్మని వాసన వేస్తున్న, నరాలతో చేసిన అల్లెత్రాటిని తింటే సరిపోతుంది." అనుకుంది.

 

అనుకున్నదే తడవుగా నక్క వింటిని సమీపించి, లాగి బిగించి ఉన్న దాని నరాలతో చేసిన అల్లెత్రాడును కొరికింది. అంతే.. పదునైన "వింటి కోపు" దాని శరీరంలో గుచ్చుకుంది. బాధతో విలవిలలాడుతూ... తన దురాశకు చింతిస్తూ నక్క ప్రాణాలు విడిచింది. ఇప్పుడక్కడ నక్కతో కలిపి ఐదు శవాలు పడి ఉన్నాయి.

 

భైరవుడు ఒక జింక చాలదని అడవిపందిని వేటాడబోయి చనిపోయాడు. నక్క ఎలాంటి కష్టం లేకుండా మూడు నెలల పాటు తిండి దొరికించుకుని కూడా, పిసినారి తనంతో వింటినారిని కొరికి, తానూ శవంగా మారింది. ఇది అంత చూస్తే మీకు ఎం అర్ధం అయ్యింది..  'దురాశ దుఃఖానికి చేటు'. మానవుడు ఆశాజీవే కానీ అత్యాశ పనికిరాదు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: