దోస్త్ మేరా దోస్త్:జగన్-ఒవైసీల మధ్య బలపడుతున్న బంధం

 హైదరాబాద్: వైఎస్ఆర్ పార్టీ అధినేత జగన్, ఎంఐఎం పార్టీ అధినేత అసదుద్దీన్ ఒవైసీల మధ్య బంధం మరింత బలపడుతోంది. అక్రమ ఆస్తుల కేసులో చంచల్గూడ జైలులో ఉన్న జగన్ను అసదుద్దీన్ ములాఖత్ పేరిట 40నిమిషాలకు పైగా ఏకాంతంగా మాట్లాడాడు. జగన్-అసదుద్దీన్ల మధ్య మంచి స్నేహామే వుంది. ఢిల్లీ స్థాయిలో జగన్కు కావల్సిన సహాయ సహకారాలను ఒవైసీ అందిస్తూ వస్తున్నారు.  జగన్ విషయంలో మొదటి నుంచీ సానుకూల అభిప్రాయంతోనే ఉన్నాడు. వారిద్దరి మధ్యన ఉన్న స్నేహాన్ని మరింత బలంగా చేయడం కోసమే ఒవైసీ జగన్ను కలిసినట్లు రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి.  జైలుకు వెళ్లి 40నిమిషాలకు పైగా జగన్నుతో భేటీ కావడంతో రానున్న రోజుల్లో వైఎస్ఆర్-ఎంఐఎంల స్నేహాం మరింత బలంగా ఉంటుందనే సంకేతాలను ఒవైసీ ఇవ్వకనే ఇచ్చారు. ఇదిలా ఉంటే ప్రస్తుతం రాష్ర్టంలో నెలకుని ఉన్న రాజకీయాల నేపథ్యంలో ఒవైసీ జగన్ను కలవడం రాజకీయంగా ఎంతో ప్రాధాన్యతను సంతరించుకుంది. ఇప్పుడు రాజకీయ వర్గాల్లో ఎక్కడ చూసినా వీరిద్దరి గురించి మాట్లాడుకుంటున్నారు.  జగన్-ఒవైసీల కలయికపై వాడివేడిగా చర్చ జరగుతోంది. అంతే కాదు, జగన్ను కలిసిన అనంతరం అసదుద్దీన్ కొన్ని ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం రాష్ర్టంలో పరిస్థితుల్లో రాష్ర్ట ప్రభుత్వాన్ని కాపాడే బాధ్యతను తమ పార్టీ భుజస్కందాల మీద వేసుకోలేదన్నారు. కేంద్రం విషయానికి వచ్చే వరకు అసదుద్దీన్ వైఖరి మరో విధంగా వుంది. రాష్ర్టపతి ఎంపిక విషయంలో మాత్రం కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ ప్రకటించిన ప్రణబ్కు మద్దతు ఇవ్వాల్సిందిగా జగన్ను కోరినట్లు ఒవైసీ వెల్లడించారు.  జగన్కు మంచి జరగాలనీ కోరుకునే అసదుద్దీన్ కేంద్రం పంపిన రాయబారిగా కూడా కొందరు భావిస్తున్నారు. జైల్లో జగన్ను కలిసిన అసదుద్దీన్ ప్రస్తుత రాజకీయాలు, కేసులు, కేంద్రంతో వ్యవహారించాల్సిన తీరు, రాష్ర్టపతి ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై వీరిద్దరూ మాట్లాడుకున్నట్లు సమాచారం. రాష్ర్టపతి ఎంపిక విషయంపై జగన్తో మాట్లాడినట్లు అసదుద్దీన్ మీడియాతో మాట్లాడుతూ చెప్పారు. ప్రణబ్కు మద్దతు కోరిన అసదుద్దీన్ అక్రమ ఆస్తుల కేసులో అభియోగాలు ఎదుర్కొంటున్న జగన్కు కూడా ఆయన మద్దతు పలికినట్లు తెలుస్తోంది. కేంద్రంలోని యూపీఏతో సఖ్యతతో ఉంటున్న ఎంఐఎం రాష్ర్టంకు వచ్చే వరకు కొంత వ్యత్యాసాన్ని కనబరుస్తోంది.  ఇటీవలి కాలంలో రాష్ర్ట ప్రభుత్వ తీరుపై ఎంఐఎం కొంత అసంత్రుప్తితో వుంది. ఇదే సమయంలో జగన్కు అనుకూలంగా వ్యవహారిస్తూ వస్తూంది. దీనితోనే తాజాగా జరిగిన ఉప ఎన్నికల్లో మైనార్టీలు ఎక్కువగా వైఎస్ఆర్ పార్టీ అభ్యర్థులకు ఓట్లు వేశారనే ప్రచారం ఊపందుకుంది. రాష్ర్టంలో జగన్ ప్రభావం అధికంగా వుందని ఎంఐఎం గట్టిగా నమ్ముతోంది. ఇదే విషయాన్ని ఇప్పటికే ఆ నాయకులు బహిరంగంగానే చెప్పారు.  మొత్తానికి రానున్న రోజుల్లో వైఎస్ఆర్ పార్టీ-ఎంఐఎం పార్టీలు కలిసి పనిచేసేందుకు ఇప్పటి నుంచే సిద్ధమవుతున్నట్లు తాజాగా చోటుచేసుకుంటున్న పరిణామాలు చెప్పకనే చెబుతున్నాయి. ఏది ఏమైనా రానున్న రోజుల్లో రాజకీయంగా కొత్త సమీకరణలకు తెరలేవనున్నదనేది స్పష్టం. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: