గత నెల మొదటి వారంలో ఎగువ ప్రాంతాల్లో కురిసిన భారీవర్షాలతో జూరాల మీదుగా శ్రీశైలం వరకు వచ్చి ఆగిపోయిన ‘కృష్ణమ్మ’ మళ్లీ తన పరవళ్లను ప్రారంభించింది.
ప్రస్తుతం మహారాష్ర్ట, కర్ణాటకలో, కురుస్తున్న వరదలతో రాష్ర్టంలోని కృష్ణా ప్రాజెక్టులకు జలకళ రానుంది. ఇప్పటికే గోదావరి పరవళ్లు తొక్కుతుండగా, త్వరలో కృష్ణమ్మ సైతం రాష్ర్టంలో తన జోరును కొనసాగించనుంది. పరిస్థితి ఇలాగే కొనసాగితే రాష్ర్టంలో తాగునీటి, సాగునీటి కష్టాలకు తిప్పలు తప్పినట్లే. కర్ణాటకలోని నారాయణపూర్, ఆల్మట్టి డ్యాం పూర్తి స్థాయిలో నిండటంతో అక్కడ గేట్లను ఎత్తివేశారు. మరో ఒకటి రెండు రోజుల్లో ఈ నీరు రాష్ర్టంలోకి ప్రవేశించి జూరాలకు చేరుకోనుంది.
దీంతో తెలంగాణలోని తాగునీరు, కోస్తాంధ్రలో కృష్ణా డెల్టాకు వరద నీరు వచ్చి చేరుతుండటంతో అన్నదాతలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. కాగా. ఈ పాటికి వాగులు, వంకలతో ఉరకలెత్తాల్సిన క్రిష్ణా, ప్రాజెక్టులు నీళ్లులేక వెలవెలబోతున్నాయి. ఇక ప్రధాన నీటి వనరులైన శ్రీశైలం, నాగార్జునసాగర్, సోమశిల తుంగభద్ర తదితర జలాశయాల్లో నీటిమట్టాలు ఎన్నడూలేని విధంగా డెడ్ స్టోరేజీకి చేరుకున్నాయి. రాష్ర్టంలో నీటిపారుదల రంగం సాగునీటి జలాలపై పెట్టుకున్న ఆశలన్నీ నీరుగారిపోయే పరిస్థితి కనిపించింది. ప్రధాన రిజర్వాయర్లపై ఆధారపడి క్రిష్ణా, గోదావరి కింద సాగుకావాల్సిన 71.59 లక్షల హెక్టార్ల ఆయకట్టు పరిస్థితి ఆగమ్యగోచరంగా మారి ఖరీఫ్ సాగుకు బ్రేక్ పడింది. కాల్వల ద్వారా నీటి పారుదల లేనికారణంగా చెరువులు, బోరుబావుల ఆధారంగా సాగు కావాల్సిన ఆయకట్టు కూడా వెలవెలబోతోంది. గతేడాది సైతం రైతులు ఖరీఫ్, రబీ సీజన్లలో వరుస కరువుల బారిన పడ్డారు. రాష్ర్ట ప్రభుత్వం 878 మండలాలను కరువు మండలాలుగా గుర్తించాల్సి వచ్చింది. చేతిలో ఉన్న సొమ్మంత పొలంలో పెట్టుబడిగా పెట్టి నష్టపోయిన రైతులు కనీసం ఈ ఏడాది పంటల ద్వారనైనా నష్టాల భారాన్ని తగ్గించుకోవచ్చన్న ఆశతో ఉన్నారు.
మరింత సమాచారం తెలుసుకోండి: