ఎడిటోరియల్ : చంద్రబాబు కోపం జగన్ పైనా ? పికె పైనా ? పీక్స్ లో ఫ్రస్ట్రేషన్

Vijaya

చంద్రబాబునాయుడు ఓ టైం టేబుల్ ప్రకారం వైసిపి అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డిని, కెసియార్, మోడిలను తిడుతున్నారు. ఇపుడీ టైం టేబుల్లో రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ కూడా వచ్చి చేరినట్లున్నారు. ఇక్కడ టైం టేబుల్ అని ఎందుకనాల్సి వచ్చిందంటే చంద్రబాబు మాట్లాడుతున్న  ప్రతీ ఎన్నికల సన్నాహక సమావేశంలోను ఒక్కొక్కళ్ళని తిట్టటానికి కొద్దిసేపు టైం కేటాయిస్తున్నారు కాబట్టే.

 

మామూలుగా అయితే ఎవరైనా ఎన్నికల సభల్లో మాట్లాడేటపుడు ఐదేళ్ళ కాలంలో తాము చేసిందేమిటి ? రేపు అధికారంలోకి వస్తే చేయబోయేదేమిటి ? అనే అంశాలపై ఎక్కువసేపు మాట్లాడతారు. ప్రత్యర్ధులపైన కూడా చెణుకులు, ఆరోపణలు, విమర్శలు సహజమే అనుకోండి అది వేరే సంగతి. చంద్రబాబు ప్రసంగాలు వింటున్నవారికి ఇక్కడే ఓ అనుమానం వస్తోంది.

 

అదేమిటంటే చంద్రబాబు అసలు ఆరోపణలు, విమర్శలు ఎవరిపైన చేయదలుచుకున్నారు ? అధికారంలోకి వస్తాడనే ప్రచారం జరుగుతున్న జగన్ పైనా ? లేకపోతే జగన్ ను అధికారంలోకి తేవటానికి వీలుగా అవసరమైన బ్యాక్ ఎండ్ కసరత్తు చేస్తున్న ప్రశాంత్ కిషోర్ (పికె) పైనా ? అనేది అర్ధం కావటం లేదు. ఒక్కమాట మాత్రం వాస్తవం.వైసిపికి ఈస్ధాయిలో ఊపు రావటంలో పికె పాత్ర కూడా ఉందనటంలో సందేహమే అవసరం లేదు.  

 

జగన్ చేసిన పాదయాత్ర, అంతుకుముందు క్షేత్రస్ధాయిలో జరిగిన కసరత్తు, జనాల అభిప్రాయాలపై ఒకటికి పదిసార్లు చేసిన సర్వేలు, అభ్యర్ధుల ఎంపికలో జరిగిన సర్వేలు, పాదయాత్ర ముందు, తర్వాత జనాలభిప్రాయాల సేకరణ తదితరాల విషయంలో పికె పాత్ర చాలానే ఉంది. ప్రతీ నియోజకవర్గంలోను అభ్యర్ధుల ఎంపికపై ఒకటికి పది సర్వే రిపోర్టులివ్వటం, టికెట్ ఎవరికివ్వాలనే విషయంలో ప్రయారిటీలో మూడు పేర్లపై సర్వే రిపోర్టులు తయారు చేయటంలో పికె గ్రౌండ్ వర్క్ చాలానే జరిగింది.

 

తెర వెనుక పికె బృందం చేసిన కసరత్తుకు అనుగుణంగా తెరపైన జగన్ యాక్షన్ తో  వైసిపి బ్రహ్మాండమైన ఊపుతో కనబడుతోంది. రేపటి ఎన్నికల్లో కాబోయే ముఖ్యమంత్రి జగనే అని పదే పదే సర్వేల్లో వస్తోందంటే మామూలు విషయం కాదు. తెరవెనుక పికె చేసిన కృషి ఏమిటో చంద్రబాబుకు పూర్తిగా అర్ధమైనట్లే ఉంది. అందుకనే జగన్ తో పాటు పికె పైన కూడా పదే పదే విరుచుకుపడుతున్నారు. నిజానికి పికెపైన విరుచుకుపడుతున్నారంటేనే చంద్రబాబులో ఫ్రస్ట్రేషన్ ఏ స్ధాయిలో ఉందో అర్ధమైపోతోంది.

 


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: