జగనన్న బాణం దూసుకొస్తోంది..!!

Vasishta

జగన్ స్పీడ్ పెంచారు. ఈసారి ఎలాగైనా అధికారంలోకి రావాలని ట్రై చేస్తున్న జగన్.. తన శక్తియుక్తులన్నింటినీ వినియోగిస్తున్నారు. ఓవైపు పాదయాత్ర కొనసాగిస్తూనే.. మరోవైపు తెరవెనుక చాలా మంత్రాగాలు నెరుపుతున్నారు. నియోజకవర్గాల్లో పార్టీ పరిస్థితిని అంచనా వేస్తూ పార్టీ బలోపేతం కోసం ప్రయత్నిస్తున్నారు. కొన్ని చోట్ల నేతలను బలోపేతం చేయడం, మరికొన్ని చోట్ల ఇతర పార్టీల నేతలను పార్టీలో చేర్చుకోవడం ద్వారా బరిలోకి దిగాలనుకుంటున్నారు. ఇదే సమయంలో పార్టీకి మంచి ఊపు తీసుకురావడానికి అవసరమైతే సోదరి షర్మిలను తెరమీదకు తీసుకురానున్నారు.


 షర్మిల.. ఈ పేరు తెలుగు ప్రజలకు సుపరిచితం. రాజన్న విసిరిన బాణాన్నంటూ షర్మిల చేసిన కామెంట్స్.. ఆమె చేసిన పాదయాత్ర వైసీపీకి ఎంతో దోహదపడ్డాయి. జగన్ జైలుకెళ్లినప్పుడు షర్మిల చేసిన ఓదార్పు యాత్రకు విపరీతమైన క్రేజ్ వచ్చింది. పార్టీని బతికించుకోవడం కోసం ఆమె చేసిన పాదయాత్ర చరిత్రలో నిలిచిపోయింది. పార్టీ బాధ్యతలన్నింటినీ ఇప్పుడు జగన్ భుజాన వేసుకోవడంతో షర్మిల క్రియాశీలంగా వ్యవహరించట్లేదు.


2014 ఎన్నికల్లో ఎంతో కీలకంగా వ్యవహరించిన షర్మిల ఇప్పుడు మళ్లీ తెరమీదకు రాబోతున్నట్టు సమాచారం. మరో ఐదారు నెలల్లో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో షర్మిలక మళ్లీ యాక్టివ్ రోల్ ఇచ్చేందుకు జగన్ సిద్ధమవుతున్నారే వార్తలు వినిపిస్తున్నాయి. గత ఎన్నికల్లో పోటకి దూరంగా ఉన్న షర్మిల.. ఈసారి అవసరమైతే ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేసేందుకు కూడా సిద్ధంగా ఉన్నారనే ఊహాగానాలు వస్తున్నాయి. ఏదైనా కీలక స్థానం నుంచి షర్మిలను ఎంపీగా బరిలోకి దించితే ఎలా ఉంటుందని జగన్, ఆమె కుటుంబసభ్యులు ఆలోచిస్తున్నట్టు సమచారం.


షర్మిలను ఎంపీగా బరిలోకి దించితే.. దాని పరిధిలోకి వచ్చే అసెంబ్లీ నియోజకవర్గాలన్నింటిపైనా ఆ ప్రభావం ఉంటుంది. అది రాష్ట్రంలో పార్టీ అధికారంలోకి రావడానికి ఎంతో దోహదపడుతుంది. అందుకే ఈసారి ఎలాంటి చిన్న అవకాశాలను దుర్వినియోగం చేసుకోకుండా.. ఉన్న అస్త్రాలన్నింటినీ వాడుకోవాలని జగన్ భావిస్తున్నట్టు తెలుస్తోంది. పైగా తండ్రిని పోలిన షర్మిల హావభావాలు వచ్చే ఎన్నికల్లో ఎంతో ప్రభావం చూపిస్తాయని భావిస్తున్నారు. అందుకే ఆమెను పూర్తి స్థాయిలో పార్టీకి వాడుకోవాలనుకుంటున్నట్టు తెలుస్తోంది.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: