ఎడిటోరియల్ : నందమూరి కుటుంబాన్ని గబ్బు పట్టించిన చంద్రబాబు

Vijaya

కుకట్ పల్లి నియోజకవర్గంలో చంద్రబాబునాయుడుకు ఓటర్లు పెద్ద షాకే ఇచ్చారు. ఇక్కడ నుండి చివరి నిముషంలో పోటీలోకి దిగిన చుండ్రు అలియాస్ నందమూరి సుహాసినిని ఓటమి దాదాపు ఖాయమైపోయింది. సుహాసిని ఓడిపోవటం ద్వారా నందమూరి కుటుంబాన్ని చంద్రబాబు గబ్బుపట్టించినట్లైంది. తాజా సమాచారం ప్రకారం సుహాసిని 12 వేల ఓట్లతో వెనకబడుంది. అంటే ఓటమి దాదాపు ఖాయమైనట్లే అనుకోవాలి. ఈ నియోజకవర్గంతో ఏమాత్రం సంబంధం లేని సుహాసినిని చంద్రబాబు రంగంలోకి దింపారు. అసలు ఈ నియోజకవర్గంలో నందమూరి కల్యాణ్ రామ్ ను పోటీ చేయించాలన్న చంద్రబాబు ప్లాన్ బెడిసికొట్టింది. దాంతో నందమూరి కుటుంబం నుండి లాభం లేదనుకుని రాజకీయంగా పార్టీ పరంగా సీనియర్ నేత అయిన చుండ్రు శ్రీహరి కోడలు సుహాసినిని పోటీకి ఒప్పించారు. దాంతో సుహాసిని కూడా పోటీలోకి దిగారు. అయితే, సుహాసిని నామినేషన్ వేసిన దగ్గర నుండి కూడా ఆమె గెలుపుపై ఎవరిలోను నమ్మకమైతే లేదు.

 

విచిత్రమేమిటంటే, సామాజికవర్గం పరంగా సుహాసిని విజయానికి పనిచేసిన వాళ్ళు కూడా అభ్యర్ధి గెలవదనే చెప్పారు. ఏదో మీడియాలో ప్రచారం ద్వారా చంద్రబాబు మ్యాజిక్ చేసి గెలుస్తుందేమో అన్న భ్రమలైతే కల్పించగలిగారు. కాకపోతే క్షేత్రస్ధాయిలో తీసుకుంటే ఓటర్లంతా అభ్యర్ధికి పూర్తి వ్యతిరేకతతో ఉన్న విషయం తెలిసిపోయింది. దాదాపు 3.7 లక్షల ఓటర్లలో కాపులు, బిసిలు, బ్రాహ్మణులు, ఎస్సీ, ముస్లింలు, రెడ్డి సామాజక వర్గం ఓటర్లలో మెజారిటీ సుహాసినికి వ్యతిరేకంగా ఓట్లు వేశారు. కారణం ఏమిటంటే, పై సామాజికవర్గం ఓటర్లందరికీ ఏపిలో రాకపోకలున్నాయి. ఏపిలో వారంతా బలమైన బంధుత్వాలు, కుటుంబసభ్యులను కలిగి ఉన్నారు. వారంతా ఏపిలో చంద్రబాబు పాలనపై మండిపడుతున్నారు. ఆ నేపధ్యంలో ఇక్కడ గనుక సుహాసినికి ఓట్లేస్తే ఏపిలో చంద్రబాబు పాలనకు మద్దతిచ్చినట్లవుతుందని భావించారు. అందుకనే ఇష్టం ఉన్నా లేకపోయినా టిఆర్ఎస్ కు ఓట్లేశారు.

 

ఇక నందమూరి కుటుంబం విషయానికి వస్తే సుహాసిని తండ్రి దివంగత నేత నందమూరి హరికృష్ణ ను చంద్రబాబు ఎంతగా అవమానించారో అందరికీ తెలిసిందే. అవసరమైనపుడల్లా నందమూరి కుటుంబాన్ని ఫుల్లుగా వాడేసుకోవటం అవసరం తీరిపోగానే తీసి అవతలపారేయటం చంద్రబాబుకు బాగా అలవాటు. అందుకనే బతికున్న రోజుల నుండే హరికృష్ణతో పాటు కొడుకులు జూనియర్ ఎన్టీయార్, నందమూరి కల్యాణ్ రామ్ చంద్రబాబుకు దూరంగా ఉంటున్నారు. అందుకనే కుకట్ పల్లిలో పోటీ విషయంలో చంద్రబాబు ఉచ్చులో కల్యాణ్ రామ్ పడకుండా జాగ్రత్తపడ్డారు. కానీ ఏవో మాయ మాటలు చెప్పి సుహాసినిని రంగంలోకి దింపి చివరకు గబ్బు పట్టించారు.

 

ఇపుడు సుహాసిని ఓడిపోయింది కాబట్టి నందమూరి కుటుంబాన్నిజనాలు తిరస్కరించారనే వాదనను పార్టీలో అంతర్గతంగా చెప్పిస్తారు. తాత నందమూరి తారక రామారావు పేరు చెబితే ఓట్లేస్తారనే భ్రమల్లో ఉందేమో సుహాసిని. కాకపోతే ఆమె మరచిపోయిన విషయం ఏమిటంటే, అదే ఎన్టీయార్ ను మహబూబ్ నగర్ జిల్లాలోని కల్వకర్తి నియోజకవర్గంలో జనాలు ఓడించారు. స్వయంగా ఎన్టీయార్ నే జనాలు ఓడించిన తర్వాత ఇక కొడుకులెంత, మనమరాలెంత ? ఏమాత్రం రాజకీయంగా ఓనమాలు తెలీని సుహాసిని మేనత్త నారా భువనేశ్వరి చెప్పుడు మాటలు విని ఎన్నికల గోదాలోకి దిగి నష్టపోయిందని అనుకోవాలంతే.

 

నిజంగానే చంద్రబాబుకు నందమూరి కుటుంబంపై అంత ప్రేమే గనుక ఉంటే వచ్చే ఎన్నికల్లో ఏపిలో టిడిపి తప్పక గెలిచే ఏదో ఓ నియోజకవర్గం నుండే పోటీలోకి దింపేవారే. ఎలాగూ హిందుపురంలో హరికృష్ణ గతంలో ప్రాతినిధ్యం వహించారు. కాబట్టి అక్కడి నుండే పోటీలోకి దింపేవారు. సుహాసినికి, నారా లోకేష్ కు పెద్దగా తేడా ఏమీ కనబడటం లేదు. కొడుకు లోకేష్ ను మాత్రం దొడ్డి దోవన ఎంఎల్సీ చేసి మంత్రిని చేశారు. అదే సుహాసినిని మాత్రం తెలంగాణాలో ప్రత్యక్ష ఎన్నికల్లో దింపారు. అంటే తన కొడుకు మాత్రం సేఫ్ జోన్లో ఉండాలి, నందమూరి కుటుంబం మాత్రం రిస్క్ లో పడాలన్నది చంద్రబాబు వ్యూహంగా కనబడుతోంది. మొత్తానికి ఓడిపోతోందని తెలిసి సుహాసిని ఎన్నికల్లోకి దింపటం ద్వారా నందమూరి కుటుంబాన్ని చంద్రబాబు మరోసారి గబ్బు పట్టించారనే అనుకోవాలి.

 


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: