మనసులోని మాటను బయటపెట్టిన చిరు

 హైదరాబాద్: పీఆర్పీ మాజీ అధ్యక్షుడు, ప్రస్తుత కాంగ్రెస్ రాజ్యసభ సభ్యుడు చిరంజీవి మ రోమారు తన మనసులోని మాటను బయటపెట్టారు. ముఖ్యమంత్రి కావాలనీ ప్రజారాజ్యం పార్టీని స్థాపించిన చిరంజీవి ఆ పార్టీ ద్వారా తాను అనుకున్న గమ్యానికి చేరుకోలేదు. పార్టీని నడపలేక తాననుకున్నసామాజిక న్యాయం కాంగ్రెస్ పార్టీతో సాధ్యమనీ భావించి పీఆర్పీని గుండుగుత్తగా కాంగ్రెస్ లో విలీనం చేశారు.  విలీనం ద్వారా ఎమ్మెల్యే నుంచి రాజ్యసభకు ప్రమోషన్ పొందారు. రాష్ర్ట కేబినెట్ లో ఇద్దరికి మంత్రి పదవులను ఇప్పించుకోగలిగారు. తనను నమ్మి ఓట్లు వేసిన వారిని వదిలేశారు. కాంగ్రెస్ లో తొలుత కేంద్ర మంత్రి అవుతాడునుకున్నప్పటికీ ఇప్పటి వరకు సాధ్యం కాలేదు. అయితే, ఈరోజు చిరంజీవి పుట్టిన రోజు. ఈ సందర్భంగా ఢిల్లీలో జరిగిన ఆయన జన్మదినోత్సవ వేడుకల్లో మాత్రం ముఖ్యమంత్ర్రి పదవీపై ఉన్న ఆశను బయటపెట్టారు. అయితే, నేరుగా చెప్పకుండా తాను ముఖ్యమంత్రి కావాలనీ కొంతమంది అభిమానులు, ప్రజలు కోరుకుంటున్నారనీ అన్నారు. చిరంజీవి ముఖ్యమంత్రి అవుతారనీ కొంతమంది అంటున్నారంటే అది వారు తన పట్ల అభిమానాన్ని చాటుకోవడమేననీ చెప్పుకొచ్చారు. తన భవిష్యత్తును ప్రజలే నిర్ణయిస్తారనీ కూడా చిరంజీవి అన్నారు. సామాజిక న్యాయం పేరిట చిరంజీవి స్థాపించిన ప్రజారాజ్యం పార్టీకి 2009ఎన్నికల్లో రాష్ర్ట వ్యాప్తంగా 70లక్షల మంది ఓటర్లు ఓట్లు వేశారు. 18మందిని ఎమ్మెల్యేలుగా గెలిపించారు. ఎంతో కొంత చిరంజీవిని నమ్మి లక్షలాది మంది ఓట్లు వేశారు. కానీ, ఆయన మాత్రం పార్టీని స్థాపించిన మూడేళ్లు కూడా గడవకముందే పార్టీని ఢిల్లీలో కాంగ్రెస్కు తాకట్టుపెట్టారు. చిరంజీవికి నిజంగానే ప్రజలకు సేవ చేయాలనే తపన ఉంటే, పార్టీని వచ్చే ఎన్నికల వరకు నడిపేవారు. కానీ, చిరంజీవి అలా చేయలేదు. 70లక్షల మంది ఓటర్ల నమ్మకాన్ని చిరంజీవి వమ్ము చేశారనే అపవాదును కూడా మూటగట్టుకున్నారు. చిరంజీవి తీసుకున్న నిర్ణయం చూస్తే ప్రజలకు సేవ చేయాలనుకునే దానికంటే సీఎం సీటుపైనే ఎక్కువగా ఆసక్తి ఉన్నట్లు తేటతెల్లమైంది.  చిరంజీవి మాదిరిగానే తమిళనాడులో విజయకాంత్ అనే సినీ హీరో పార్టీని స్థాపించాడు. రెండు సీట్లు వచ్చినప్పటికీ విజయకాంత్ పార్టీని మూసివేయలేదు. రెండు సీట్ల నుంచి 20సీట్ల వరకు పార్టీని తీసుకువచ్చాడు. అధికార పార్టీ కి మిత్రపక్షంగా ఉంటూనే విజయకాంత్ తమిళనాడులో ప్రజాసమస్యలపై అలుపెరగనీ పోరాటం చేస్తున్నాడు. కానీ, ఇక్కడ మాత్రం చిరంజీవి మాత్రం అలా చేయలేదు. తాను అనుకున్న సీఎం సీటు దక్కకపోవడంతోనే పీఆర్పీని కాంగ్రెస్ లో విలీనం చేసి, పార్టీ కార్యాలయానికి తాళం వేశాడు. ఇప్పుడు తన పుట్టిన రోజున కూడా తన మనసులో ఉన్న సీఎం పదవీ గురించి మాట్లాడారు. దీన్ని బట్టి చిరంజీవికి సీఎం పదవీ మీద ఉన్న మక్కువ ప్రజల మీద లేదనీ చెప్పకనే చెప్పారు.  

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: