అచ్చేసిన ఆంబోతు మీరంటే మీరే! జివిఎల్ నరసింహరావు సీఎం రమేష్

ఆంధ్రప్రదేశ్‌ లో ఆదాయ పన్ను శాఖ తనిఖీల నేపథ్యంలో బీజేపీ, తెలుగు దేశం పార్టీల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. తెలుగు దేశం రాజ్యసభ సభ్యుడి నివాసంలో ఐటీ సోదాలపై ఆ పార్టీ నాయకులు కేంద్రంపైనా, బీజేపీ పైనా దుమ్మెత్తి పోశారు. రాష్ట్రం పై కేంద్రం కక్ష సాధింపు చర్యలు పాల్పడుతోందని ఆరోపించారు. దీనికి బీజేపీ నాయకులు కూడా టీడీపీ నాయకులపై ప్రతి విమర్శలకు దిగారు. కడపలో ఉక్కు పరిశ్రమను ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ కేంద్ర మంతిని టీడీపీ ఎంపీలు కలిసే ముందు బీజేపీ అధికార ప్రతినిధి, రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు ట్విట్టర్ వేదికగా టీడీపీ ఎంపీలపై విమర్శలకు దిగారు.

 

"టీడీపీ ఎంపీలకు ఆర్భాటం ఎక్కువ, అవగాహన తక్కువ, స్టీల్ మినిస్టర్ బిరేందర్ సింగ్‌ ను కలిసే ముందు రాష్ట్ర ప్రభుత్వం జీఎస్‌ఐ ద్వారా సబ్మిట్ చేయవలసిన రిపోర్ట్ ఎందుకు ఆలస్యం అయ్యిందో తెలుసుకుంటే బాగుండేది. డ్రామాల పైనా, అవినీతి పైనా ఉన్న శ్రద్ధ అభివృద్ధి పై ఉండుంటే రాష్ట్రం బాగుపడేది" అని ట్వీట్ చేశారు.

 

దీనిపై సీఎం రమేష్ విలేఖరులతో మాట్లాడుతూ తెలుగు దేశం పార్టీ చేసే పోరాటాలను విమర్శించే స్థాయి జీవీఎల్ నరసింహారావుకు లేదని అన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో జరుగుతున్న ప్రతి విషయం లోనూ తలదురుస్తున్నారని, అవగాహన లేకుండా పచ్చి అబద్ధాలు మాట్లాడుతున్నారని ఆరోపించారు. ఆంధ్రప్రదేశ్‌ పైకి బీజేపీ పెద్దలు జీవీఎల్‌ను అచ్చేసిన ఆంబోతులా వదిలారని మండిపడ్డారు.

 

తెలుగు దేశం ప్రభుత్వంపై జీవీఎల్ చేసిన విమర్శలకు సమాధానం చెప్పేందుకు తాను సిద్ధంగా ఉన్నానని సీఎం రమేష్ సవాల్ విసిరారు. దీనికి స్పందించిన జీవీఎల్ "రమేష్ గారూ! రాష్ట్రాన్ని దోచేసిన ఆంబోతులు ఎవరో ప్రజలకు తెలుసు. మీ లాగే చాలెంచ్ చేసి టీడీపీ ఎంపీ సుజనా చౌదరి గతంలో తోక ముడిచారు. మీరూ అంతే! మీ ఎంపీలకు పౌరుషం ఎక్కువ, ఫెర్ఫార్మన్స్ తక్కువ. నేను చర్చకు సిద్ధమే. ఎప్పుడైనా! ఎక్కడైనా! అని జీవీఎల్ సవాల్ విసిరారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: